జగన్ ఏడాది పాలన.. ముద్ర వేశారా.? వేయించుకున్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 11:43 AM GMT
జగన్ ఏడాది పాలన.. ముద్ర వేశారా.? వేయించుకున్నారా.?

ఆర్నెల్లలో అందరి మీదా తన ముద్రను వేస్తానని ధీమా చెప్పి.. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టి ఏడాది అవుతోంది. తనను వ్యతిరేకించే వారిని మనసుల్ని మార్చేలా తన పాలన ఉంటుందన్న మాట ఆయన పదే పదే చెప్పేవారు. ప్రభుత్వ ప్లాగ్ షిప్ పథకాలకు పెద్దపీట వేయటం ద్వారా ఏపీలో పాలనా రథాన్ని పరుగులు తీయిస్తానని చెప్పిన జగన్.. ఏడాదిలో ఏం చేశారు? ఏం చేయలేకపోయారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండేలా పాలన పైనే ఫోకస్ అన్నట్లు చెప్పిన జగన్.. తన మాటలకు తగ్గట్లే చేతల్లో చూపించారా? అన్న విషయంలోకి వెళ్లినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఒక ముఖ్యమంత్రి ఏడాది పాలనను రివ్యూ చేయటం.. అభిప్రాయాన్ని తీర్పులా చెప్పటం తేలికైన విషయం కాదు. అందునా జగన్ లాంటి అధినేత నిర్ణయాల వెనుక కారణాలు చాలానే ఉంటాయన్నది మర్చిపోకూడదు. అందరూ నడిచే బాటలో నడవటానికి జగన్ కు సుతారం ఇష్టముండదు. పార్టీ నేతలకు సైతం సమయం ఇవ్వని జగన్.. అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారులతో కలిసి భోజనం చేయటం.. నేతలు ఎక్కడైనా వసూళ్లకు పాల్పడితే స్వయంగా ఫోన్ చేసి హెచ్చరించటం లాంటి ఆసక్తికర అంశాలు లీకుల రూపంలో బయటకు వచ్చేవి.

సాధారణంగా పవర్లోకి వచ్చిన తొలినాళ్లలో వచ్చే వార్తలు కాస్త భిన్నంగా ఉంటాయి. పలనా రథాన్ని నడిపించే విషయంలో లోటుపాట్లు ఉన్నా.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను ప్రదర్శించటం మామూలే. దీనికి భిన్నమైన పరిస్థితుల్ని జగన్ ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పాలి. తనను అభిమానించే వారెంతో.. తనను తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ఎక్కువన్న విషయం జగన్ కు తెలియంది కాదు. ఈ విషయాల్ని చూసుకుంటూనే.. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ.. పాలనపైన ముద్రవేయటం అంత తేలికైన విషయం కాదు.

ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాల్లో చిన్న పారపాట్లు చోటు చేసుకున్నా.. జరిగే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే కాబోలు.. తప్పులు జరగకుండా ఉండటానికి చాలానే జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతారు. అధికారంలోకి వచ్చినంతనే గ్రామ సచివాలయాలు.. వాటికి సిబ్బందిని నియమించటం కోసం చేసిన కసరత్తు మామూలు విషయం కాదు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే క్షేత్రస్థాయిలో తనదైన సిబ్బందిని సమకూర్చుకున్న ఘనత జగన్ కే దక్కుతుందని చెప్పాలి.

కిలో రూపాయి బియ్యాన్ని.. సంచుల్లో డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధం చేసిన పథకం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా భారమవుతుందన్నది మర్చిపోకూడదు. అయినప్పటికీ సర్కారు ఇమేజ్ బిల్డింగ్ కోసం అలాంటి విషయాల్ని పట్టించుకోకుండా ఖర్చు చేసేవారు. ఎన్నికల వేళ తన నోటి నుంచి పదే పదే ప్రస్తావించిన నవరత్నాల అమలు విషయంలో వేగం కాస్త తగ్గినప్పటికీ.. కొన్ని విషయాల మీద మాత్రం ఆయన విజన్ ను మెచ్చుకోక తప్పదు. విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేయటంతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ఫీజులు వేసే పథకాన్ని చూసినప్పుడు జగన్ తెలివి ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ప్రభుత్వ సొమ్మును కాలేజీలకు కాకుండా తల్లిదండ్రులకు నేరుగా వారి ఖాతాల్లోకి వేసే అంశాన్నే చూస్తే.. జగన్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడ కాలేజీలకు లబ్థి చేకూరేకన్నా.. ప్రజలు తాము ఏ విద్యా సంస్థలో చేరాలన్న దానిపై లబ్థిదారుల ఛాయిస్ ఉండేలా పథకాన్ని డిజైన్ చేయటం చూస్తే.. యువనేత తీరును పూర్తిగా తప్పు పట్టలేని పరిస్థితి.

ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన లాంటి అంశాలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మారినకాలానికి.. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసినప్పుడు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన మంచిదే. కానీ.. ఇదే నిర్ణయాన్ని తాను విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఇంగ్లిషు విద్యా బోధన విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పే క్రమంలో.. అందరిని కలుపుకుపోయేలా వ్యవహరిస్తే బాగుండేది. కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డారనే చెప్పాలి.

తనకు నచ్చింది చేసే విషయంలో జగన్ ఎంత పట్టుదలతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించటమే కాదు.. శంకుస్థాపన పూర్తై.. పలు నిర్మాణాలు వేగంగా సాగుతున్న వేళలో.. తమ ప్రభుత్వం వచ్చినంతనే అక్కడి నిర్మాణాలు ఆపించటమే కాదు.. రానున్న రోజుల్లో ఏపీ రాజధాని నగరం ఎప్పుడు.. ఎక్కడ ఏర్పాటు చేస్తారో అర్థం కాని పరిస్థితి. రాజధానిని మొత్తం మూడు చోట్ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కాస్తా వివాదాస్పదం కావటం తెలిసిందే. తనను విమర్శించే వారి వాదనల్ని వినేందుకు ఏ మాత్రం ఆసక్తిని చూపించని ఆయన.. ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. రైతులు నిరసనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదు. లాక్ డౌన్ వేళలోనూ వారి నిరసన బయట ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటంలో సక్సెస్ అయ్యారు.

రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చూసిచూడనట్లుగా వ్యవహరించే దివంగత మహానేత వైఎస్సార్ కు జగన్ కు పోలికే లేదని లేదని చెప్పాలి. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. సాయం కోసం వెతుక్కుంటూ వచ్చే వారెవరైనా సరే.. ఆదరించి.. వారు అడిగిన పనిని చేసే విషయంలో వైఎస్సార్ తీరు వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా జగన్ వ్యవహరశైలి ఉండేదని చెబుతారు.

రైతుల కోసం భరోసా పథకంతో పాటు.. నాణ్యమైన పురుగు మందులు.. విత్తనాలను అందించే కార్యక్రమానికి తెర తీశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న నిధుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. రాష్ట్రానికున్న సమస్యను కొంతమేర సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తన దుబారా ఖర్చుల్నికొంతమేర తగ్గించటంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. రూ.60వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల్ని చేపట్టటం.. దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయటమే కాదు.. దానికి తగ్గట్లే మద్యాన్ని సర్కారే స్వయంగా నిర్వహిస్తోంది. కాకుంటే.. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లపైన గుర్రుగా ఉన్నట్లు చెబుతారు. తాను చెప్పిన్నట్లుగా దశల వారీ మద్య నిషేధం కోసం పెద్ద ఎత్తున పన్ను వడ్డింపులతో మందుబాబులకు నిరుత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

మంచిపనులు ఎన్ని చేసినా.. ఒకట్రెండు వివాదాలు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంటాయి. తిరుగులేని ప్రజాదరణతో ముఖ్యమంత్రి కుర్చీలోకూర్చున్న జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీ ఉనికిని చాటేలా.. ప్రభుత్వ కార్యాలయాల్ని పార్టీ రంగులతో నింపేస్తున్న తీరుపై హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. అయినా.. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. మొండిగా వ్యవహరించటం లాంటివి ఏ మాత్రం మంచిది కాదు. పట్టువిడుపులు పాలకులకు ఉండాలి.

ప్రతిది రాజకీయ కోణంలోనూ.. మైలేజీ మత్తులోనూ పడకూడదు. చుట్టూ ఉన్న వారు ఇంద్రుడు.. చంద్రుడు అని పొగిడినా పడిపోయే తత్త్వం జగన్ కు లేదు. ఎందుకంటే.. ఈ స్థానానికి ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. నిజానికి.. జగన్ కు అదే పెద్ద ఇబ్బంది. తనను అణిచివేసేందుకు జరిగిన ఎన్నో ప్రయత్నాల్ని చూశారు. మరెన్నింటినో ఎదుర్కొన్నారు. అలాంటి గడ్డు పరిస్థితి మరోసారి రాకూడదన్న ఆలోచన మంచిదే. అందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం మంచిది కాదు. పాలకుడు కఠినంగా ఉండాలి. అదే సమయంలో అవసరానికి అనుగుణంగా ఎవరినైనా ప్రేమించే గుణం.. ప్రత్యర్థుల్ని క్షమించటం చాలా అవసరం. అప్పుడు మాత్రమే తిరుగులేని అధినేత అవుతారు.

Next Story