ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
By సుభాష్ Published on 14 March 2020 8:36 AM ISTతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నమక్కల్ వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. వాహనంలో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. కాగా, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువైపులా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గత నెలలో కూడా కోయంబత్తూరు తిరుప్పూర్ సమీపంలో టైల్స్ లోడ్ తో వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో 20 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది.