కేసీఆర్.. కేటీఆర్.. మధ్య అనుబంధం ఆసక్తికర ముచ్చట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 11:08 AM IST
కేసీఆర్.. కేటీఆర్.. మధ్య అనుబంధం ఆసక్తికర ముచ్చట్లు

చాలామందికి తెలీదు కానీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో మరో కోణం ఉంది. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కఠినంగా ఉండే ఆయన.. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల విషయంలోనూ అంతకు మించిన కఠినత్వాన్ని ప్రదర్శిస్తారని చెబుతారు. పిల్లలంటే ప్రాణం. కానీ.. ఆ ప్రేమను వారిని సానబెట్టే సమయంలో మాత్రం అస్సలు కనిపించదని చెబుతారు. ఎంత వజ్రమైనా సరే.. సరైన రీతిలో సానబెట్టకుంటే రాయి మాదిరే ఉంటుంది. ఈ విషయంపై కేసీఆర్ కున్నంత క్లారిటీ మరే రాజకీయ అధినేతకు లేదని చెబుతారు.

ఈ కారణంతోనే పని విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు. బయటివారితో సమానంగా.. ఆ మాటకు వస్తే వారి కంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల విషయంలో ఉంటారని చెబుతరాు. సాధారణంగా రాజకీయాల్లో అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్న వారు.. తమ వారసులను గారాబంగా చూసుకుంటారు. తమతో పాటు రాజకీయాల్లో కలిసి నడిచే కొడుకు.. కూతురు విషయంలో ప్రాణపదంగా చూసుకోవటం.. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించటం కనిపిస్తుంటుంది.

ఇందుకు భిన్నంగా వ్యవహరించటం గులాబీ బాస్ కేసీఆర్ కు సొంతమని చెబుతారు. కొడుకు.. కుమార్తె మీద ఇష్టం చాలానే ఉంటుంది. కానీ.. రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం సారు తీరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటుందని చెబుతారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఫ్యామిలీ మెంబర్లు అని కూడా చూడకుండా కరకుగా వ్యవహరిస్తారని చెబుతారు. 2018 ఎన్నికల సమయంలో ఒకే దఫా రికార్డు స్థాయిలో అభ్యర్థులను ప్రకటించటం గుర్తుండే ఉంటుంది. ఆ జాబితా కేసీఆర్ తో పాటు ఇద్దరికి మాత్రమే తెలుసని.. ఆ ఇద్దరిలో కేటీఆర్ లేకపోవటం చూస్తే.. గులాబీ బాస్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పటానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.

కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగే వారు.. ఆయనలోని కొన్ని విషయాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. కొడుకంటే ప్రేమ ఉన్నప్పటికి.. ఏ రోజు కూడా నలుగురు ముందు పొగడటానికి ఇష్టపడరని చెబుతారు. అంతేనా.. పొగిడే సందర్భం వచ్చినా మాట తప్పిస్తారట. అవసరమైతే.. రెండు మాటలు అందరి ముందు అనేస్తారని చెబుతారు. కేబినెట్ మీటింగ్ లో కానీ.. రివ్యూలో కానీ కేటీఆర్ నోటి నుంచి ఏదైనా పొరపాటు సలహా.. సూచన వస్తే విని ఊరుకోవటం.. బాగా చెప్పావు లాంటి మాటలు ఉండవట. ఏం మాట్లాడుతున్నావ్.. అన్నట్లుగా మాట అనేస్తారట.

ఇలాంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయని.. అయితే ఈ మాటల్ని కేటీఆర్ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారని చెబుతారు. అధికారిక కార్యక్రమాల్లోనూ.. అంతర్గత సంభాషణల్లో బయటవారితో తండ్రి ప్రస్తావన తెచ్చినప్పుడు.. నాన్న అనే మాట అస్సలు రాదట. ‘సార్’.. ‘బాస్’.. అనే చెబుతుంటారని.. అదే సమయంలో తండ్రి అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలని చెబుతారు.

ఎంత సన్నిహితులైనా.. జిగిరీ అయినా ఏ సందర్భంలోనూ తండ్రి మీద ఈగ కాదు కదా.. ఈగ రెక్క కూడా వాలటానికి ఇష్టపడని తత్త్వం కేటీఆర్ లో కనిపిస్తుందని చెబుతారు. ఈ కారణంతోనే కావొచ్చు.. ఎప్పుడైనా టీఆర్ఎస్ నేతలు ప్రైవేటుగా ఉన్నప్పుడు వారి మధ్య తండ్రి.. కొడుకుల ప్రస్తావన వస్తే అదే విషయం మీద కాసేపు మాట్లాడుకోవటం.. వారి అనుబంధం గురించి ఆడ్మైరింగ్ గా మాట్లాడుకోవటం కనిపిస్తుంటుంది. ఏమైనా ఇలాంటి తీరు రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగిన కుటుంబాల్లో అస్సలు కనిపించదని చెబుతుంటారు.

Next Story