కోర్టు ఆదేశాల‌ను మేర‌కు వారిని రెగ్యులరైజ్ చేస్తారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 7:29 AM GMT
కోర్టు ఆదేశాల‌ను మేర‌కు వారిని రెగ్యులరైజ్ చేస్తారా.?

మైలేజీ వచ్చేస్తుందంటే.. చాలు ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని చెబుతారు. అదే సమయంలో.. ఎంత ముఖ్యమైనా.. మరెంత అవసరమైనా.. తాను తీసుకునే నిర్ణయం ఒకరి ప్రభావం ఉందన్న భావన కలిగినా.. మరెవరికీ మైలేజీ వస్తుందనిపిస్తే చాలు.. ఆ నిర్ణయాన్ని తీసుకోవటానికి ససేమిరా అనే గుణం ఆయన సొంతమన్న విమర్శ కూడా వినిపిస్తోంది. తాజాగా అలాంటి ఆదేశమే ఒకటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి వెలువడింది. దీనిపై కేసీఆర్ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అవుట్ సోర్సింగ్ విధానంలో దీర్ఘకాలం పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయకుండా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ విధానంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. వారందరికి సర్వీసు రెగ్యులరైజ్ చేయాలన్న ఆదేశాల్ని జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు.

ఇంతకూ విషయం ఏమంటే.. జీహెచ్ఎంసీలో పదేళ్లు.. అంతకంటే ఎక్కువ కాలం పాటు అవుట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న 98 మంది పారిశుధ్య కార్మికుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. శానిటరీ సిబ్బంది.. ఇతర కేటగిరిల ఉద్యోగుల్ని అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14..16.. 21లను ఉల్లంఘించమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ విధానంలో సిబ్బంది నియామకాలు చేయటం పెద్ద యాయ.. మోసపూరిత విధానంగా కోర్టు అభివర్ణించింది.

ఈ సందర్భంగా కేసును విచారించిన న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కోర్టును ఆశ్రయించిన తేదీ నుంచి పిటిష‌నర్లకు ఆయా పోస్టులకు నిర్దేశించిన కనీస టైం స్కేల్ వేతనాన్ని చెల్లించాలని పేర్కొంది. వారికి చెల్లించాల్సిన బకాయాల్ని ఈ ఏడాది జులై 31 వరకు లెక్క పెట్టి వచ్చే నెల (సెప్టెంబరు) 15లోపు చెల్లించాలని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Next Story