ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 7:58 AM GMT
ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉన్న నేఫ‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను ఎలా విడుద‌ల చేస్తుందంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి య‌త్నించారు.

పీపీఈ కిట్లు ధరించిన‌ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్బంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. డిగ్రీ, ఓయూ, యూజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ హై కోర్టును ఆశ్రయించామ‌ని.. తెలంగాణ హైకోర్టులో ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా కూడా ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేఫ‌థ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ప్రమాదమ‌ని అన్నారు. అనంత‌రం పోలీసులు ప్రగతి భవన్ ముట్టడించిన వారిని అరెస్ట్ చేసి గోశామహల్ పీఎస్‌కు త‌ర‌లించారు.

Next Story