బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 12:12 PM GMT
బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ వద్ద నిర్మించిన కుడివైపు ప్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ఫ్లై ఓవ‌ర్‌ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి దేశంలోనే మొదటిగా ప్ర‌త్యేక టెక్నాలజీని వినియోగించారు. స్లాబ్స్‌, క్రాష్‌ బారియర్స్‌, ఫిక్షన్‌ స్లాబుల నిర్మాణంలో ఆర్‌సీసీ ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీ వాడినట్లు మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు.

ఈ ఫ్లైఓవ‌ర్ తో బైరామ‌ల్ గూడ జంక్ష‌న్‌, సాగ‌ర్‌రోడ్ జంక్ష‌న్ లో ట్రాఫిక్ క‌ష్టాలు తీరిపోనున్నాయి. బైరామ‌ల్‌గూడ జంక్ష‌న్‌లో ర‌ద్దీ స‌మ‌యంలో గంట‌కు దాదాపు.. 12 వేల వాహ‌నాల రాక పోకలు సాగిస్తున్నాయ‌ని ఓ అంచ‌నా. ఈ ఫ్లైఓవ‌ర్‌తో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్ పెట్టారు. సికింద్రాబాద్ నుండి ఒవైసీ జంక్ష‌న్‌కు, శ్రీ‌శైలం వెళ్లే వాహ‌న‌దారుల‌కు కూడా ఈ ఫ్లైఓవ‌ర్ ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది.

ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ. 448 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 పనుల్లో ఇప్పటికే 6 పూర్త‌య్యాయి. మిగిలిన పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో నిర్మించిన కుడి వైపు ఫ్లైఓవ‌ర్ తో పాటు అండ‌ర్ పాస్‌, కామినేని జంక్ష‌న్‌లో కుడి వైపుతో పాటు ఎడ‌మ వైపు ఫ్లైఓవ‌ర్ , చింత‌ల్ కుంట అండ‌ర్ పాస్‌లు అందుబాటు లోకి రావడం తో సాఫీగా సాగుతోంది ప్రయాణం.శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ ను ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఎస్‌.ఆర్‌.డి.పి కింద ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టింది జీహెచ్ఎంసీ.

Next Story
Share it