తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రతకు కారణమిదే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Sep 2020 8:28 AM GMTఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో రోజుకు 10వేల కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. ఇక, తెలంగాణలోనూ రోజుకు 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందులోనూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వివాహాలు, ఫంక్షన్లకు విధించిన నిబంధనలు పాటించకపోవడమే కేసుల సంఖ్య పెరుగుదలకు ముఖ్యకారణమని చెబుతున్నారు. ఏపీతోపాటు,తెలంగాణ రాష్ట్రాల్లో వివాహాలు, విందులు, వినోదాలతో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణుుల అంటున్నారు.
ఆంక్షలు సడలించడంతో ప్రజలు యధేచ్ఛగా వివాహాలు, తదితర ఫంక్షన్లకు హాజరవుతుండడం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి వివాహాది కార్యక్రమాలు జరగకపోవడం వల్లే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. మొహమాటానికి విందులకు వెళ్లడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అయితే, నిబంధనల ప్రకారం పరిమిత సంక్యలో పెళ్లిళ్లు జరుపుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా...జనం పట్టించుకోవడం లేదని, కరోనాకు ముందు జరుపుకున్నట్లే వందలాది మందితో ఫంక్షన్లు జరుపుకుంటున్నారని అంటున్నారు. ప్రజలు మొహమాటానికి పోయి పెళ్లిళ్లు తదితర ఫంక్షన్లక నిబంధనలకు విరుద్ధంగా హాజరైతే మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.