డిసెంబరు వరకు మారిటోరియం ఉండనుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 7:46 AM GMT
డిసెంబరు వరకు మారిటోరియం ఉండనుందా?

అక్కడెక్కడో వూహాన్ లో మాయదారి రోగం వచ్చిందన్నప్పుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. అందుకు చెల్లించాల్సిన మూల్యం ఎంత భారీగా ఉంటుందన్న విషయం తెలుసుకున్న ప్రపంచం ఇప్పుడు కిందామీదా పడుతోంది. కాస్త ముందుగా కళ్లు తెరుచుకున్న ప్రపంచ గమనం మరోలా ఉండేదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడేం అనుకున్నా.. పోయిందేమీ తిరిగి రాలేని పరిస్థితి.

లాక్ డౌన్ ఫేజ్ ల్ని చూసేసిన దేశం.. ఆన్ లాక్ 2.0 ప్రస్తుతం అమల్లో ఉంది. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. గతంలో లాక్ డౌన్ ను ప్రభుత్వాలు విధిస్తే.. ఇప్పుడు ఎవరికి వారు స్వీయ లాక్ డౌన్ ను విధించుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో.. పెద్ద ఎత్తునవ్యాపారాలు.. వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోని పరిస్థితి. దేశీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి కారణంగా.. దెబ్బ తినని రంగమంటూ ఏమీ లేదు. పెద్ద ఎత్తున వ్యాపారాలు పోవటమే కాదు.. ఉద్యోగాలు పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకున్న వారికి.. స్వల్ప ఊరటనిస్తూ మారిటోరియంను ఆర్ బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలుత మార్చి నుంచి మే వరకు మారిటోరియం కల్పించి.. తర్వాత మరో మూడు నెలలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు సరికదా.. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది వచ్చే ఏడాదిలోనే అన్న మాట బలంగా వినిపిస్తోంది.

దీంతో.. మారిటోరియంను మరికొంత కాలం పొడిగించాలన్న డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. వ్యాపారాలు తిరిగి ప్రారంభం కాకపోగా.. కనుచూపు మేర కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక.. ఆన్ లాక్ లో భాగంగా తెరిచిన వ్యాపారాలు సైతం మళ్లీ మూతబడుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. ఉద్యోగులు సరిగా రాకపోవటం.. వ్యాపారాలు పెద్దగా లేకపోవటంతో వ్యాపారులు తమ వ్యాపారాల్ని సాగించేందుకు ఆసక్తిని చూపించటం లేదు.

దీంతో.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టువరకు అమల్లో ఉన్న మారిటోరియంను.. డిసెంబరు వరకు పొడిగించటమే మేలని చెబుతున్నారు. సాధారణ స్థితిలోకి రాకుండా మారిటోరియంను ఎత్తేస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని చెబుతున్నారు. గడిచిన రెండేళ్లుగా బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడుస్తున్న మొండి బకాయిల్ని గణనీయంగా తగ్గించుకున్న బ్యాంకులకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారినట్లుగా చెబుతున్నారు. మహమ్మారి కారణంగా బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు ఆల్ టైం హైకు చేరుకోవటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటోరియంను డిసెంబరు వరకు పొడిగించటానికి తప్పించి మరో మార్గం లేదన్న మాట బలంగా వినిపిస్తుంది. అదే జరిగితే..కాస్తంత ఉపశమనం కలుగుతుందని చెప్పక తప్పదు.

Next Story
Share it