ఢిల్లీకి దగ్గర్లో కనిపించిన ఆ రాక్షసుడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 5:34 AM GMT
ఢిల్లీకి దగ్గర్లో కనిపించిన ఆ రాక్షసుడు

వారం రోజుల కిందట ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ పోలీసులను అతి కిరాతకంగా తన అనుచరులతో కలిసి చంపేసిన వికాస్ దూబేను పట్టుకోడానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తూ ఉన్నారు. 25కు పైగా ప్రత్యేక బృందాలను వికాస్ దూబేను పట్టుకోవడం కోసం నియమించారు. ఇప్పటికే వికాస్ దూబే అనుచరులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, వికాస్ దూబేను పట్టించిన వారికి లేదా సమాచారం ఇచ్చిన వారికి రెండున్నర లక్షల నగదు పురస్కారం కూడా ఇస్తామని తెలిపారు.

ఇలాంటి సమయంలో వికాస్ దూబే ఢిల్లీకి సమీపంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో ఓ హోటల్ లో పని కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ హోటల్ లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు రావడానికి కొద్ది సమయానికి ముందే వికాస్ దూబే లాంటి పోలికలు ఉన్న వ్యక్తి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు హోటల్ మేనేజర్ తెలిపాడు.

పోలీసులు కూడా అతడు వికాస్ దూబే అని కన్ఫర్మ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ లో వికాస్ దూబే కనిపించాడు. మాస్క్ తో వికాస్ దూబే కనిపించాడు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంకుర్ అని.. వికాస్ దూబే తలదాచుకోడానికి సహాయం చేసింది ఇతడే అని తెలుస్తోంది. మరో వ్యక్తి ప్రభాత్.. వికాస్ దూబే స్వగ్రామానికి చెందిన వ్యక్తని పోలీసులు గుర్తించారు.

శుక్రవారం నుండి కనిపించకుండా పోయిన ఈ క్రిమినల్ ను పట్టుకోడానికి 25కు పైగా పోలీసు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అతడి తల మీద 2.5 లక్షల రూపాయల బౌంటీని పెట్టారు అధికారులు. హర్యానా రాష్ట్రం లోని రెండు నగరాలు ఫరీదాబాద్, గురుగ్రామ్ లలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. దేశ రాజధానిలో లొంగిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వికాస్ దూబే అనుచరుడు అమర్ దూబే ను బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్(ఎస్.టి.ఎఫ్.) పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. మరో క్రిమినల్ శ్యాము బాజ్ పాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు వికాస్ దూబేను అదుపులోకి తీసుకుందామని వెళ్లిన పోలీసులపై వికాస్ దూబే అనుచరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర కుమార్ మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. పోలీసులు వారి గ్రామంలోకి వస్తున్నారని ముందే వికాస్ దూబేకు సమాచారం అందడంతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ లో పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. వికాస్ దూబే నివసించే బిక్రూ గ్రామం ఈ పోలీసు స్టేషన్ పరిధి లోకే వస్తుంది. పలువురు పోలీసులను ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా మరికొందరిపై క్రిమినల్ కేసులు పెట్టారు.

వికాస్ దూబేకు పోలీసు డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తులే సహాయం చేయడంతో ఈ మారణహోమం జరిగిందని భావిస్తూ ఉన్నారు. చౌబే పూర్ పోలీసు స్టేషన్ లో పని చేసే వినయ్ తివారీ అనే స్టేషన్ ఆఫీసర్ ఎప్పటి నుండో వికాస్ దూబేకు సహాయం చేస్తూ వస్తున్నాడట.. పెద్ద ఘటన ఏదో జరగబోయే అవకాశం ఉందని ఓ జూనియర్ ఆఫీసర్ గతంలోనే హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా డిఎస్పీ ఆఫీసుకు లెటర్ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఓ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Next Story