హర్యానా: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ ప్రధానమంత్రికి రాజ్‌నాథ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదంపై పోరాడితే భారత్‌ మద్దతిస్తుందని, ఒకవేళ సైనిక సహాయాన్ని కోరినా ఇవ్వడానికి సిద్దమని ఆయన స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ సమావేశాలలో.. భవిష్యత్తులో అణుయుద్దం జరిగే అవకాశం ఉందంటూ ఇమ్రాన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్‌నాథ్‌ మండిపడ్డారు.

కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పిస్తామని ఇమ్రాన్‌ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికలలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్‌ వ్యూహం బెడిసి కొట్టిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారని రాజ్‌నాథ్‌ కొనియాడారు. ఈ నెల 21న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 90 అసెంబ్లీ సీట్లకు గాను 47సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.