హ‌మ్మ‌య్య చిరుత చిక్కింది.. ఊపిరి పీల్చుకున్న రాజేంద్రనగర్‌ వాసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 5:01 AM GMT
హ‌మ్మ‌య్య చిరుత చిక్కింది.. ఊపిరి పీల్చుకున్న రాజేంద్రనగర్‌ వాసులు

గత ఆరు నెలలుగా రాజేంద్రనగర్‌ వాసులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. హిమాయత్‌ సాగర్‌ వాలంతరి వెనుకనున్న పశువుల కొట్టం వద్ద శుక్రవారం రాత్రి రెండు లేగ దూడలను చిరుత చంపింది. ఈ నేప‌థ్యంలో వ్యవసాయ క్షేత్రంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

వివ‌రాళ్లోకెలితే.. హిమాయత్‌సాగర్‌ సమీపంలోని వాలంతరి వెనుక భాగంలో అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా నివాసం ప‌క్క‌నే ఉన్న‌ పొలంలోని పశువుల కొట్టంలో కట్టేసిన రెండు లేగదూడలను చిరుత చంపిన వ్యవహారంపై శనివారం ఉదయం రాజేంద్రనగర్‌ పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో శంషాబాద్‌ రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ శ్యాంకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని.. సేకరించిన కాలివేలి ముద్రలనుబట్టి ఆరు నెలలుగా చిరుత సంచరిస్తోందని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. చిరుతను పట్టడానికి రెండు బోన్లు, 10 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అనుకున్న‌ట్టుగానే వారు ఏర్పాటు చేసిన ఓ బోనుకి చిరుత చిక్కింది. ప్రతి 10–15 రోజులకు ఒకసారి కనిపిస్తూ హల్‌చల్‌ చేస్తున్న చిరుత ఎట్ట‌కేల‌కు అట‌వీ అధికారుల‌కు చిక్క‌డంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story