అహోబిలంలో చిరుత సంచారం

By సుభాష్  Published on  9 Jun 2020 3:15 AM GMT
అహోబిలంలో చిరుత సంచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం దుర్గమ్మ ఆలయం సమీపంలో ఓ చిరుతపులి రోడ్డుపై కనిపించడం కలకలం సృష్టించింది. అహోబిలం పుణ్యక్షేత్రంలో దట్టమైన అడవులు, ఎత్తైన కొండలున్నాయి. ఇక అడవుల్లోంచి బయటకు వచ్చిన చిరుత రోడ్డుపై సేదతీరుతూ వాహనదారులకు కనిపించింది. కొన్ని క్షణాల పాటు వాహనాలకు దారి ఇవ్వకుండా అట్లాగే రోడ్డేపై కూర్చుండిపోయింది. వాహనంలో ఉన్న వాళ్లందరూ భయంతో వణుకుతూ అలాగే ఉండిపోయారు. వాహనం లైట్లు కూడా ఆర్పకుండా అలాగే ఉండిపోయారు. తర్వాత అడవుల్లోకి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రోడ్డుపై కనిపించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఓ చిరుత తెగ టెన్షన్‌ పెడుతోంది. ఇటీవల గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటల పాటు సంచరించింది. అటవీ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ దొరకకుండా పోయింది. హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత నారం ఫామ్‌ హౌస్‌ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లింది. కాగా, తాజాగా చిరుత కదలికలు అక్కడి సీసీటీవీ పుటేజీలో కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిరుత కదలికలపై అధికారులకు సమాచారం అందించారు. ఇలా అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు రోడ్లపైకి, జనవాసాల మధ్యకు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిరుత సంచరించిన ప్రాంతాల్లో జనాలు ఇళ్లల్లోంచి బయటకు వెళ్లకుండా భయాందోళన చెందుతున్నారు.

Next Story