మళ్లీ టెన్షన్‌.. రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం

By సుభాష్  Published on  29 May 2020 5:00 AM GMT
మళ్లీ టెన్షన్‌.. రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం

రాజేంద్రనగర్‌లో చిరుతపులి సంచరించడం మరోసారి కలకలం రేపుతోంది. జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీ పుటేజీలో చిరుత సంచరించన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. కాగా, ఆ ప్రాంతంలోనే గ్రేహౌండ్స్‌ పోలీసుల శిక్షణ కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా పులి సంచరిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈనెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటల పాటు సంచరించింది. అటవీ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ దొరకకుండా పోయింది.

అయితే ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు తెలుపడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీ చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో చుట్టుపక్కల ఉన్న పలు కాలనీలు రాజేంద్రనగర్‌ గ్రామస్తులను జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Next Story