ప్రతి పక్షానికి పక్కనే కూర్చున్న సచిన్ పైలట్.. ఏమన్నారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 11:52 AM GMT
ప్రతి పక్షానికి పక్కనే కూర్చున్న సచిన్ పైలట్.. ఏమన్నారంటే..!

రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయం రోజుకొక మలుపు తిరిగినప్పటికీ చివరికి సచిన్ పైలట్ వర్గం శాంతించడంతో బీజేపీ వశమవ్వడానికి అవకాశం లేకుండా పోయింది.

సీఎం అశోక్ గెహ్లాట్ కు, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు రావడంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. బీజేపీ అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నా.. కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి సచిన్ పైలట్ అశోక్ గెహ్లాట్ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో తన బలం నిరూపించుకోడానికి అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సచిన్ పైలట్ తో సమావేశమైన తరువాత, ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాజస్థాన్ అసెంబ్లీలో అశోక్ గెహ్లాట్ సర్కారు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో నెగ్గింది. ఈ బల పరీక్ష ముగిసిన అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.

ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సచిన్ పైలట్. అసెంబ్లీలో సచిన్ పైలట్ కూర్చున్న సీటు గురించి బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం గెహ్లాట్ పక్కన కూర్చున్న సచిన్... ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులకు దగ్గరగా ఉన్న స్థానంలో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్‌ తనదైన శైలిలో స్పందించారు.

సభలోకి వచ్చిన తర్వాత నా సీటును మార్చినట్టు గమనించి ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలా జరిగిందని అనుకున్నానని.. ఆ సీట్లో కూర్చున్న తర్వాత సురక్షితంగా ఫీల్ అయ్యాను. నన్ను బోర్డర్ కు పంపించారని ఆ తర్వాత అనుకున్నా. సాధారణంగా ధైర్యవంతులను, దృఢమైన వారినే బోర్డర్ కు పంపుతుంటారు. నన్ను కూడా అందుకే పంపించారు అని సచిన్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it