మారిన మిత్రుడి మనసు.. గట్టెక్కిన గెహ్లోత్ సర్కారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2020 8:01 AM GMTగడిచిన కొద్ది రోజులుగా రాజస్థాన్ రాజకీయాల్ని హీటెక్కించిన సచిన్ పైలెట్ ప్రయత్నం.. తాజాగా ఫెయిల్ అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్న రాజస్తాన్ లో అధికారపక్షానికి చెందిన సచిన్ పైలెట్ వేసిన ఎత్తులు చిత్తు అయినట్లే కనిపిస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్ని చీల్చటం ద్వారా గెహ్లోత్ సర్కారుకు చుక్కలు చూపినప్పటికీ.. తెర వెనుక సాగిన మంతనాలు.. చేసిన ప్రయత్నాలు ఇప్పటికైతే ఆయన సర్కారుకు ఢోకా లేదన్న భావన కలిగేలా చేస్తోంది.
నిన్నటివరకూ కాంగ్రెస్ పార్టీకి మిత్రుడిగా ఉండి దూరమైన బహుజన ట్రైబల్ పార్టీ.. తాజాగా తమ పార్టీ గెహ్లోత్ సర్కారుకు మద్దతు ఇస్తుందని చెప్పటమే కాదు.. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఓటు వేయాలంటూ విప్ జారీ చేసింది. దీంతో.. గెహ్లోత్ బలం అసెంబ్లీలో 101గా మారింది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు 101 మెజార్టీ తప్పనిసరి. సచిన్ పైలెట్ పుణ్యమా అని.. మొన్నటివరకూ మైనార్టీలో ఉన్నట్లు కనిపించిన ప్రభుత్వం.. తాజాగా మిత్రుడి చేయూతతో గండం నుంచి గట్టెక్కినట్లేనని చెప్పాలి.
తనకు పెరిగిన బలాన్ని రాజ్ భవన్ కు తెలియజేయటమే కాదు.. తమకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల జాబితాను ఇచ్చి వచ్చారు. ఇక.. మిగిలింది అసెంబ్లీలో బలనిరూపణే. ఇప్పటికే పార్టీకి దూరమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరటంతో పాటు.. మద్దతు ఇస్తున్న వారి విషయంలోక్లారిటీ వచ్చేసిన నేపథ్యంలో సచిన్ ప్రయత్నం ప్రస్తుతానికి ఎలాంటి ప్రయోజనం ఉండనట్లేనని చెబుతున్నారు.
తమ ప్రభుత్వానికి అండగా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను గవర్నర్ కు అందజేయటం.. అందులో 101 మంది ఎమ్మెల్యేలు ఉండటం చూసినప్పుడు.. గెహ్లోత్ సర్కారు బలపరీక్షలో క్షేమంగా బయటపడిపోవటం ఖాయమని చెప్పకతప్పదు. అదే సమయంలో.. పైలెట్ తో సహా తిరుగుబాటు బావుటా వేసిన 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ చీఫ్ విప్ స్పీకర్ కు సమర్పించారు.దీనికి వ్యతిరేకంగా పైలెట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మంగళవారం వరకూ వాయిదా వేయాలని హైకోర్టు చెప్పిన మీద.. న్యాయస్థానం చెప్పే మాట సచిన్ పైలెట్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపటం ఖాయమని చెప్పక తప్పదు. ఒకవేళ.. సచిన్ పైలెట్ కు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే.. ఆయన ఫ్యూచర్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.