కొన‌సాగుతున్న రాజస్తాన్ రాజకీయ ర‌గ‌డ‌..!

By Medi Samrat  Published on  17 July 2020 3:00 PM GMT
కొన‌సాగుతున్న రాజస్తాన్ రాజకీయ ర‌గ‌డ‌..!

రాజస్తాన్‌లో రాజుకున్న రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్ అస‌మ్మ‌తి నేత సచిన్ పైలట్.. ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల‌కు హైకోర్టులో ఊరట లభించింది. పైలట్, ఆయన మద్దతుదారులైన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చర్యలను మంగళవారం వరకు నిలిపివేయాలంటూ స్పీకర్ సీపీ జోషిని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది.

కాంగ్రెస్‌ అధిష్టానం తమ‌కు అనర్హత నోటీసు పంపడాన్ని సవాలు చేస్తూ గురువారం స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం వేసిన పిటిషన్‌ను ఈరోజు విచారించిన కోర్టు.. ఈ మేరకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. స‌చిన్ పైల‌ట్ స‌హా 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల‌కు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులను కొట్టివేయాలంటూ ధ‌ర్మాస‌నాన్ని కోరారు.

అసమ్మతి అంటే పార్టీ ఫిరాయించడంకాదని, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో నోటీసులు ఇవ్వడం సరైనదికాదని వాదించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమ‌వారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవ‌ద్ద‌ని కోర్టు స్పీకర్‌కు సూచించింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల‌పై వేటు వేసింది. ప్రతిపక్ష బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పడేసేందుకు కుట్రలు పన్నారన్న ఆరోపణలతో భన్వర్‌లాల్‌, విశ్వేంద్ర సింగ్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది.

మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆడియో టేపుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దీనిపై అధికార కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై పార్టీ నేతల ఫిర్యాదు మేరకు రాజస్తాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) కేసు నమోదు చేసింది.

Next Story