ధోనీ కెప్టెన్సీ లాగే.. రోహిత్ కెప్టెన్సీ ఉంటుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 10:01 PM IST
ధోనీ కెప్టెన్సీ లాగే.. రోహిత్ కెప్టెన్సీ ఉంటుంది

టీమిండియా ఓపెన‌ర్‌, వైస్‌కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీపై క్రికెట‌ర్‌ సురేశ్ రైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మిస్ట‌ర్ కూల్‌, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలాగే.. రోహిత్ కెప్టెన్సీ ఉంటుంద‌ని అన్నాడు. చాలావ‌ర‌కూ మ్యాచ్‌లోని కీల‌క స‌మ‌యాల్లో రోహిత్ కూడా ధోనీ మాదిరే ఎంతో కూల్‌గా ఉంటాడ‌ని వ్యాఖ్యానించాడు.

ఇటీవ‌లే జ‌రిగిన పూణేతో జ‌రిగిన‌ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ చూశాన‌న్నాడు రైనా. ఆ మ్యాచ్‌లో 2-3 అద్భుత‌మైన నిర్ణ‌యాల‌తో జ‌ట్టును ముందుకు న‌డిపి.. త‌న కెప్టెన్సీ టాలెంట్‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని ఈ వెట‌ర‌న్ క్రికెట‌ర్ రోహిత్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అంతేకాదు.. రోహిత్ శ‌ర్మ‌లో ఎంతో ఆత్మ‌స్థైర్యం ఉంటుంద‌ని.. ఇలాంటి ఆట‌గాడే మిగ‌తా ఆట‌గాళ్ల‌లో స్ఫూర్తినింప‌గ‌ల‌డని రైనా అన్నాడు.

Raina

త‌నో బిందాస్ ఆట‌గాడ‌ని.. ఏ ప‌రిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగినా ప‌రుగులు చేసే ఓ అరుదైన ఆట‌గాడ‌ని.. ఎంత‌ ఒత్తిడి స‌మ‌యంలోనూ కంగారు ప‌డ‌కుండా ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడ‌ని రైనా అన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్‌ విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా నిలుస్తాడ‌ని రైనా ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

ఇదిలావుంటే.. తాను ప్రాతినిధ్యం వ‌హించే చైన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై కూడా రైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 2015 ప్ర‌పంచ క‌ప్‌లో టాపార్డ‌ర్‌లో భారీ అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడ‌ని గ‌త అనుభ‌వాల‌ను గుర్తు చేశాడు. ధోనీ ఆలోచ‌న‌లు బాగుంటాయ‌ని.. అలాంటి ఆలోచ‌న తీరు క‌లిగివుండ‌టం దేవుడిచ్చిన వ‌ర‌మ‌ని త‌న బాస్‌ను కొనియాడాడు.

Next Story