భారత్ బచావో ర్యాలీ.. మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్
By అంజి Published on 14 Dec 2019 2:04 PM ISTఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు దేశ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని రాహుల్ అన్నారు. రేప్ ఇండియా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు. భారత్‌లో ఎన్నో మతాల ప్రజలు ఉన్నారని తెలిపారు. తన పేరు రాహుల్ సావార్కర్ కాదని.. రాహుల్ గాంధీ అని అన్నారు. తాను నిర్భయంగానే మాట్లాడుతానని.. మోదీ, అమిత్‌షానే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నోట్ల రద్దుతో దేశ ప్రజలను కోలుకోలేని దెబ్బతీశారని, పేదల నుంచి దోచుకొని అంబానీకి దోచిపెడుతున్నారని రాహహుల్ ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంబానీ, ఆదానీలకు మోదీ 25 పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. ఉల్లి కిలో 200 రూపాయలు దాటినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు.
ప్రధాని తనని తాను గొప్ప దేశ భక్తుడనని చెప్పుకుంటున్నారని రాహుల్ అన్నారు. దేశ ద్రోహులు కూడా చేయని పనులు మోదీ చేశారని విమర్శలు చేశారు. రైతులకు మోదీ రుణమాఫీ చేయలేదు... కానీ 20 మంది బడాబాబులకు రూ.1.40 లక్షల కోట్లు మఫీ చేశారన్నారు. రైతులు, ఉద్యోగులు, యువత జేబుల్లో డబ్బులు లేవన్నారు. ప్రధాని మోదీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కున్నారని రాహుల్ మండిపడ్డారు. రైతులు లేకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా ముందుకెళ్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం విభజించే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రైతులు అభివృద్ధి చెందకుండా ఏ దేశ కూడా అభివృద్ధి చెందదని రాహుల్ పేర్కొన్నారు. అధికారం కోసం మోదీ దేశానికి నష్టం చేస్తున్నారని రాహుల్ అన్నారు.
ఆర్థిక మాంద్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
దేశ రక్షణకు అందరూ సిద్ధం కావాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశం ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉందని.. ప్రజలు ఉద్యమించకపోతే కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు. యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని, రైతులు అష్టకష్టాలు పడుతున్నారని సోనియా పేర్కొన్నారు. మోదీ తప్పుడు విధానాలతో పని చేస్తున్నారన్నారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ ఎక్కడుందని సోనియా ప్రశ్నించారు. నల్లధనం ఎందుకు బయటకు తీసుకురాలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీ నిలదీశారు. మన కంపెనీలు ఎందుకు దివాళా తీస్తున్నాయో చెప్పాలన్నారు. బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో భారత్ ఆత్మ క్షోభిస్తోందని... ప్రతి రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.