పీవీ కుమార్తె వాణీదేవిని సీఎం కేసీఆర్ కౌన్సిల్‌కు పంప‌నున్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 7:33 AM GMT
పీవీ కుమార్తె వాణీదేవిని సీఎం కేసీఆర్ కౌన్సిల్‌కు పంప‌నున్నారా.?

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి త్వరలోనే తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి అడుగుపెట్టేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. గవర్నర్ నామినీగా వాణీ దేవికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళసై ను సోమవారం నాడు కోరినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్ ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. విద్యారంగంలో సేవలు అందిస్తున్న ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో జరిగే కేబినెట్ లో వీటి కోసం ముగ్గురి పేర్లను సీఎం ఖరారు చేసే అవకాశం ఉండగా అందులో ఒకరు.. వాణీ దేవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న సమయంలో వాణీదేవిని ఎమ్మెల్సీగా నియమించి, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలన్నది కేసీఆర్ ఉద్దేశ్యం అని తెలుస్తోంది.

తమిళసై తో పలు కీలక అంశాలపై చర్చించేందుకు కేసీఆర్ భేటీ అయినట్టు తెలుస్తోంది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానాలను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు.

Next Story