ఏపీ మంత్రివర్గ విస్తరణకు డేట్ ఫిక్స్
By Medi Samrat Published on 20 July 2020 12:17 PM GMT
ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చర్చలకు తెర దించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించింది.
ఆ రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవులు దక్కే అవకాశముంది.
అలాగే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. దీంతో రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఇరువురినీ నామినేట్ చేయాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను ప్రభుత్వం కోరింది.