కేసు దర్యాప్తు: వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించిన సీబీఐ

By సుభాష్  Published on  20 July 2020 6:41 AM GMT
కేసు దర్యాప్తు: వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుపై రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు. కేసు విచారణలో భాగంగా శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కూడా వివేకా సొంత పట్టణం పులివెందులలో విచారణ చేపట్టారు. 2019మార్చి 14న అర్థ రాత్రి ఇంట్లోనే వివేకా దారుణ హత్యకు గురయ్యారు. కేసు విచారణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు ఆదేశించాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం .. కేసుకు సంబంధించిన విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో కేసు నమోదు, దర్యాప్తు వివరాలు తెలుసుకోవడమే కాకుండా అవసరమైన రికార్డులను కూడా ఆదివారం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం వివేకా నివసించే ఇల్లు, రింగ్‌ రోడ్డు పరిసరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.

అయితే వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నాలుగు నెలల తర్వాత సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. కాగా, కేసులను ఛేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 1300 మంది అనుమానితులను సిట్‌ అధికారులు విచారించారు. ఇక హత్య కేసులో అనుమానంగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే ఇంత దర్యాప్తు జరిగినా.. ఇప్పటి వరకు అసలు హతకులు ఎవరనేది తేల్చలేకపోయారు. ఈ కేసు దర్యాప్తు జాప్యం అవుతోందని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును మార్చి 11న సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అనుమానితులను విచారించే అవకాశం ఉంది.

పులివెందులకు వివేకా కుమార్తె..

కాగా, మూడో రోజు కేసు దర్యాప్తునకు సీబీఐ పులివెందులకు చేరుకుంది. విచారణలో భాగంగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. మూడో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత హైదరాబాద్‌ నుంచి పులివెందుకు చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులతో ఆమె మాట్లాడారు.

Next Story