ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్‌ వద్దకు మూడు రాజధానుల బిల్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 11:48 AM GMT
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్‌ వద్దకు మూడు రాజధానుల బిల్లు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను(రాజధాని వికేంద్రీకరణ) రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించింది. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే కనుక మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయం పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటుంటే.. ఇప్పుడు రాజధానుల అంశం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాయి.

నెల రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీలో రెండోసారి ఆమోదించి వాటిని శాసనమండలికి పంపారు. వాటిని శాసనమండలి ఆమోదించలేదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లు నెల రోజులు గడిచింది కాబట్టి దాన్ని ఆమోదించాల్సిందిగా అసెంబ్లీ అధికారులు గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. అయితే, గతంలో ఈ బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ యనమల కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని, ఆమేరకు శివరామకృష్ణ కమిటీ నివేదిక అనుసరించి అమరావతిని ఎంచుకున్నారని తెలిపారు. అంతేతప్ప, విభజన చట్టంలో ఎక్కడా రాజధానులు అనే మాట లేదని, ఇప్పటి ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా మూడు రాజధానులు చేయాలంటే మాత్రం విభజన చట్టంలో ఆ మేరకు సవరణ అవసరం అని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్రం పరిధిలోని అంశమని పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫారసుల ఆధారంగానే రాజధాని ఏర్పాటు కావాలని విభజన చట్టంలో ఉందని యనమల తెలిపారు.

యనమల వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని నిపుణులు చెప్పారని, నిపుణుల కమిటీ చెప్పింది టీడీపీ నేతల తలకు ఎక్కడంలేదని విమర్శించారు. "మీకు తెలిసిందల్లా ఒక్కటే... మీ ప్రయోజనాలు. మీరే నిపుణులు అనుకోవడం సరికాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంతపాడే యనమల కొత్త కొత్త అంశాలు తెరపైకి తెస్తుంటారు. యనమల ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండోసారి మండలిలో బిల్లులు పెట్టి నెలరోజులైనందున వాటిని అసెంబ్లీ అధికారులు నిబంధనల ప్రకారం గవర్నర్ కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 (2) ప్రకారం మండలిలో రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత అవి ఆటోమేటిగ్గా ఆమోదం పొందుతాయన్నది యనమలకు తెలియదా? అని ప్రశ్నించారు.

అమరావతిపై మీ ప్రేమ ఏంటో ప్రజలందరికీ అర్థమైందని, మీ నేతల బినామీ భూములను, మీ నాయకుల ఆస్తులను, మీ సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే అని అన్నారు. ఐదేళ్లలో మీరు అమరావతికి చేసింది ఏమిటి? తాత్కాలిక భవనాలు తప్ప ఏంచేశారు? భూములు బలవంతంగా లాక్కున్నారు. కనీసం ఆ భూములిచ్చిన వాళ్లకు తిరిగి ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారు.అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు.

Next Story
Share it