ఏపీలో మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 11:24 AM GMT
ఏపీలో మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2602 కేసులు నమోదు కాగా.. 42 మంది మృత్యువాత పడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 40646కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్క్ తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే స్థలాల్లో, ప్రయాణ సమయాల్లో మాస్క్‌ను ఖచ్చితంగా ధరించడం తప్పనిసరి. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్వి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని ఈ ఆదేశాల్లో జవహర్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

ఈ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు కూడా విధిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకూ ఏపీలో ఇంత ఖచ్చితమైన నిబంధనలు లేకపోయినప్పటికీ.. ఇకపై తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కూడా మాస్క్ తప్పనిసరి. నిబందనలు ఉల్లంగించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

Mask compulsory in AP

Next Story
Share it