లోక్‌సభ సీటు మారింది.. 'ఒక మెట్టు ఎక్కాను'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 10:04 AM GMT
లోక్‌సభ సీటు మారింది.. ఒక మెట్టు ఎక్కాను

గత కొంత కాలంగా పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూర్చునే స్థానాల‌ను మారుస్తూ లోక్‌స‌భ స‌చివాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ప్రస్తుతం నాలుగో లైన్ లో కూర్చుంటున్న రఘురామకృష్ణరాజు సీటు ఏడో లైన్ లోకి మారుస్తూ లోక్ సభ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ లోక్ సభ పక్షనేత సూచన మేరకు ఈ మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. రఘురామకృష్ణరాజు స్థానంలో మార్గాని భరత్‌ కూర్చోనున్నారు. మార్గాని భరత్‌ కూర్చునే స్థానాన్ని కోటగిరి శ్రీధర్‌కు, కోటగిరి శ్రీధర్‌ స్థానాన్ని బెల్లాన చంద్రశేఖర్‌కు కేటాయించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ స్థానంలో రఘరామకృష్ణరాజు చైర్‌ మారిపోయింది. వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ.. పార్టీ ఎంపీలు.. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేసిన త‌ర్వాత ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది.

కాగా.. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని, తమ పార్టీలో తనను వెలివేశారన్నారు. అయినప్పటికీ తాను ఎన్నడూ సీఎం జగన్‌కు, తన పార్టీకి విధేయుడినేనని తెలిపారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాతో స‌మావేశం అయిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు అంశాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జేపీ నడ్డాతో రాజకీయ అంశాలు చర్చించలేదు.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చర్చకు వ‌చ్చాయ‌ని.. పార్ల‌మెంట్ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ అధ్యక్షుడిగా కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు, విధివిధానాలపై జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ న‌డ్డాతో చ‌ర్చించాన‌న్నారు. జులై 29 నుంచి పార్లమెంట్ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించిన ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఇప్ప‌టికే రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కూడా ఈ అంశంపై స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరిన‌ట్టు తెలిపారు.

Next Story
Share it