భారత్ లోకి పబ్ జీ తిరిగి రాబోతోందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Sep 2020 10:06 AM GMTపబ్ జీ బ్యాన్ అవ్వడంతో ఆడే వాళ్ళు షాక్ తిన్నా.. తల్లిదండ్రులు కాస్త హ్యాపీగా ఉన్నారు. పబ్‌జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలని గతంలో డిమాండ్లు కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఇటీవలే పబ్ జీ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
పబ్ జీని భారతదేశంలో బ్యాన్ చేయడం ద్వారా ఆ కంపెనీకి భారీగా నష్టం వాటిల్లింది. దీంతో ఆ తప్పును సరిదిద్దుకోడానికి పబ్‌జీ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. పబ్‌జీ గేమ్ రూపొందించింది సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ కావడంతో పబ్ జీని బ్యాన్ చేసే అవకాశాలు ఉండవని చాలా మంది భావించారు. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తూ ఉండడంతో భారత్ లో దీన్ని బ్యాన్ చేశారు.
భారత్ లో పబ్‌జీ మొబైల్ వర్షన్ రిలీజ్ చేసింది కూడా టెన్సెంట్ గేమ్స్ కంపెనీనే కావడంతో భారత ప్రభుత్వం చైనా యాప్స్‌ని నిషేధం విధిస్తుండటంతో టెన్సెంట్ గేమ్స్ రిలీజ్ చేసిన పబ్‌జీ మొబైల్ పైనా బ్యాన్ జరిగింది. ఒకవేళ టెన్సెంట్ కంపెనీ దీనిని భారత్ లో ప్రమోట్ చేయకపోతే.. సౌత్ కొరియా కంపెనీ కాబట్టి బ్యాన్ చేసే అవకాశం ఉండేది కాదు.. కాబట్టి సౌత్ కొరియాకు చెందిన పబ్‌జీ కార్పొరేషన్ పరిస్థితిని గమనించింది. భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను కోల్పోకూడదని భావిస్తోంది. ఇకపై పబ్‌జీ మొబైల్‌కు, టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని తెలిపింది.
పబ్‌జీ మొబైల్ యాప్‍ను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ నిర్వహించకపోతే భారత్ లో ఎటువంటి నిషేధం కూడా ఉండదు. పబ్‌జీ మొబైల్ వర్షన్‌ని కూడా పబ్‌జీ కార్పొరేషన్ చూసుకోబోతుండడంతో పబ్ జీ తిరిగి భారత్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. చైనా మూలాలు ఉండని యాప్ ను భారత ప్రభుత్వం కూడా అడ్డుకోడానికి సాహసించదు. త్వరలో పబ్ జీ ని భారత్ లోకి పబ్ జీ కార్పొరేషన్ విడుదల చేయడం పక్కా అని భావిస్తూ ఉన్నారు. పబ్ జీ వెళ్లిపోవడంతో భారత్ మార్కెట్ ను క్యాష్ చేసుకోవాలని చాలా గేమింగ్ కంపెనీలు భావిస్తూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఫౌజీ గేమ్ ను భారత్ లో ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉన్నారు.