ఓ వైపు రియాను అరెస్టు చేసే అవకాశం.. సుశాంత్ సోదరిపై సంచలన ఆరోపణలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 11:39 AM GMT
ఓ వైపు రియాను అరెస్టు చేసే అవకాశం.. సుశాంత్ సోదరిపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని పలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు విచారిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి కేసును పెట్టింది. ప్రియాంక సింగ్ బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను తీసుకుని వచ్చిందని.. ఫోర్జరీ కేసును పెట్టింది రియా. సుశాంత్ ప్రియాంక సింగ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కారణంగా అయిదు రోజుల తర్వాత మరణించాడని రియా కేసులో పేర్కొంది.

ప్రియాంక సింగ్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ లు కలిసి సుశాంత్ కు వేరే మందులు ఇచ్చారని రియా చెబుతోంది. ఈ విషయంలో ఫోర్జరీ చేసుకుందని.. తప్పుడు ప్రిస్క్రిప్షన్ కారణంగా సుశాంత్ ప్రాణాలు కోల్పోయాడని ముంబై పోలీసులకు తన ఫిర్యాదులో తెలిపింది రియా.

ఇటీవల బయటకు వచ్చిన వాట్సప్ చాట్ లను ఆధారం చేసుకుని రియా తాజాగా ఫిర్యాదును చేసింది. జూన్ 8న సుశాంత్ కు, ప్రియాంక సింగ్ కు మధ్య జరిగిన సంభాషణలో మందుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే..!

మరో వైపు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం తాను డ్రగ్స్ కొన్నట్టు ఆమె అంగీకరించింది. తాను అతనికి డ్రగ్స్ ఇచ్చానని, తాను మాత్రం వాటిని వినియోగించలేదని చెప్పింది.

తన సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె అధికారులకు తెలిపింది. ఈ కేసును మరింత లోతుగా విచారించే క్రమంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, మిరండాలను అరెస్ట్ చేశారు.

ఓ వ్యక్తిని ప్రేమించినందుకు ఆమెకు ఎదురవుతున్న పర్యవసనాలు ఇవేనని రియా తరఫు న్యాయవాది సతీశ్ మానే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమించడం నేరమా? ఆమె ఓ దుర్మార్గురాలనే భావనలోనే చూస్తున్నారు. రియా అమాయకురాలు కాబట్టే ఆమె ఇంతవరకు ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టును కూడా ఆశ్రయించలేదు. ఆమెపై బీహార్ పోలీసులు కేసులు నమోదు చేసాక సీబీఐ, ఈడీ, ఎన్సీబీ కూడా వచ్చాయంటూ సతీశ్ మానే షిండే అన్నారు.

Next Story