రాహుల్‌, ప్రియాంకల‌ను అడ్డుకున్న పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2020 3:01 PM IST
రాహుల్‌, ప్రియాంకల‌ను అడ్డుకున్న పోలీసులు

యూపీలోని హత్ర‌స్‌లో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బాలిక మృతిచెందడం పట్ల విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. తాజాగా ఈ ఘటనపై యూపీ కాంగ్రెస్‌ ప్రధాన నగరాల్లో నిరసన చేపట్టింది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇంచార్జ్‌ ప్రియాంక గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు హ‌త్ర‌స్‌కు బయలుదేరారు. పోలీసులు వీరిని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే దగ్గర అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే నడక ప్రారంభించారు. ఇక‌ వీరి రాక సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు.



అయితే.. అక్కడ 144 సెక్షన్‌ను విధించడంతో.. రాహుల్‌, ప్రియాంకల‌ను బాధితురాలి గ్రామానికి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలి గ్రామం చుట్టు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. గ్రామంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. రాహుల్‌, ప్రియాంకలు బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో నెల‌కొన్న‌ తాజా పరిణామాలపై ఆ రాష్ట్ర‌ మాజీ ముఖ్య‌మంత్రులు అధినేత్రి మాయావతి,‌ అఖిలేష్‌ యాదవ్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, యోగీని వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన హ‌త్యాచార బాధితురాలిని.. అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత యూపీ పోలీసులు హడావుడిగా అంత్యక్రియలు జరిపించార‌నే విమ‌ర్శ‌లు వెలువ‌డుతున్నాయి. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. అర్థరాత్రి వేళ‌ రహస్యంగా అంత్యక్రియలు జరపాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్రతిపక్షాలు యూపీ స‌ర్కార్‌ను ప్ర‌శ్నిస్తున్నాయి.

Next Story