ఆమెను కడసారి కూడా చూసుకోలేకపోయిన కుటుంబ సభ్యులు.. యూపీ పోలీసుల తీరేంటో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 11:05 AM GMT
ఆమెను కడసారి కూడా చూసుకోలేకపోయిన కుటుంబ సభ్యులు.. యూపీ పోలీసుల తీరేంటో

ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో ఓ యువతిని నాలుక కోసి అత్యాచారం చేసిన ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. అత్యాచారం చోటుచేసుకున్న తర్వాత ఆమెను అలీఘర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

అత్యాచారానికి గురైన యువతి శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయి, నాలుక తెగిపోయి, అవయవాలు పనిచేయని స్థితిలో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవలే నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారని, 14వ తేదీన ఫిర్యాదు చేస్తే నాలుగైదు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో కూడా పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ యువతి కుటుంబ సభ్యులు ఇప్పటికే మండిపడుతూ ఉండగా.. తమను దగ్గరకు కూడా రానివ్వకుండా చివరి చూపుకు నోచుకోనివ్వకుండా పోలీసులు శవాన్ని దహనం చేశారని యూపీ పోలీసులపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తమ సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి శవ దహనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురాగా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో రాత్రి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి, ఉదయమే దహనం చేస్తామని ఆమె తండ్రి పోలీసులకు చెప్పినప్పటికీ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూతురిని కడచూపునకు నోచుకోకుండా చేశారంటూ ఆమె తల్లి రోదిస్తూ చెప్పింది.

ఆసుపత్రి వద్దే తానున్నా, కనీసం చెప్పను కూడా చెప్పకుండా మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారని యూపీ పోలీసులపై బాధితురాలి సోదరుడు నిప్పులు చెరిగారు. ఆసుపత్రి ముందు బాధితురాలి బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతోనే, మరింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడకుండా చూసేందుకు, శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూసేందుకు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అంబులెన్స్ ను డైరెక్టుగా శ్మశానవాటిక దగ్గరకు పోలీసులు తీసుకుని వెళ్లారనే వాదన కూడా వినిపిస్తోంది.

ఆమె నివాసం వద్ద భారీ ఎత్తున మొహరించిన పోలీసులు.. కుటుంబసభ్యుల్ని ఇంట్లో బంధించారు. సాంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు నిర్వహించాలని వేడుకున్నా పట్టించుకోని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో బలవంతంగా దహనం చేశారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం మరో వివాదానికి తావిస్తోంది.

ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ గా తీసుకున్నారు. నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని ఆదిత్యనాథ్ స్ప‌ష్టంచేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామ‌ని.. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించ‌నుంద‌ని యోగీ తెలిపారు. ఈ కేసులో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని ఆయన హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధాని కూడా త‌న‌ను ఆదేశించార‌ని అన్నారు.

Next Story