రాష్ట్రపతి శీతాకాల విడిది ఖరారు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
By సుభాష్ Published on 19 Dec 2019 2:26 PM ISTముఖ్యాంశాలు
20న బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్న రాంనాథ్ కోవింద్
ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు
28న ఢిల్లీకి తిరుగు ప్రయాణం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది అధికారికంగా ఖరారైంది. డిసెంబర్ 20న రాష్ట్రపతి హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రయాణించే వాహనాల కాన్వాయ్‌తో బుధవారం రూట్ రిహార్సల్స్ నిర్వహించారు. ఆయన రాక సందర్భంగా ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచీ అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రపతి విడిదిలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగనున్నాయి.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు!
రాష్ట్రపతి హైదరాబాద్‌కు రానున్ననేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్ - ఎయిర్ ఫోర్స బెటాలియన్ 2, 3 గేట్లు, బొల్లారం చెక్ పోస్టు, సహేజ్ ద్వార్, ఈఎంఈ సెంటర్ వద్ద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్ పంప్ హౌస్, బిసిన్ ఎన్విరాన్ మెంట్ పార్కు, బిసిన్ హెడ్ క్వార్టర్స్, మెయిన్ గేట్, యాప్రాల్ బిసిన్ బేకరీ ఎక్స్ టెన్షన్, నేవీ హౌస్ జంక్షన్, ఆంధ్రా సబ్ ఏరియా ఆఫీసర్స్ మెస్, ఆర్ఎస్ఐ జంక్షన్, ఈఎంఈ సెంటర్ హౌస్ గేట్ నెంబర్ 3, 2, 1, రాష్ట్రపతి నిలయం మెయిన్ గేట్ వరకు ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు.
రాష్ట్రపతి విడిది ఎప్పటి వరకు..
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బస చేయనున్నారు. 23న ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి చెన్నై లేదా పుదుచ్చెరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి తిరువంతపురం వెళ్లనున్నారు. 26న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. అలాగే 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం 28న మధ్యాహ్నం 3.15 గంటలకు హకీంపేట నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.