పవన్ విషయంలో బీజేపీ మౌనం.. ప్లాన్‌లో భాగమేనా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ మౌనం వహిస్తోంది. ఓ వైపు జనసేన తమ మిత్రపక్షం అని చెప్పుకుంటూనే, మరోవైపు పవన్ ర్యాలీకి ఎలాంటి మద్ధతు పలకడం లేదు.
By అంజి
పవన్ విషయంలో బీజేపీ మౌనం.. ప్లాన్‌లో భాగమేనా?
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో తమ పార్టీ పొత్తు ఉందని చెబుతూనే ఉన్నారు. శనివారం కూడా వర్చువల్ మోడ్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా బీజేపీ-జనసేన మధ్య బలమైన బంధం ఉందని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని సందేశాన్ని బలంగా తీసుకోవాలని ఆమె కోరారు. కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను, ఆయన పార్టీని పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన, విశాఖపట్నంలో జరుగుతున్న వారాహి యాత్రలో కోస్తా ఆంధ్రలో ఆయన ర్యాలీలకు బీజేపీ నేతలు దూరంగా ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తుండగా, ఆ రెండు పార్టీలు ఇంకా పొత్తు పెట్టుకోనప్పటికీ, జనసేనకు బలమైన కూటమి భాగస్వామిగా ఆయన చెప్పుకుంటున్న బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ చేపడుతున్న ఆందోళనల్లో చేరకపోవడం, పవన్ ర్యాలీలో పాల్గొనడం మర్చిపోయినట్టు కనిపిస్తోంది. బీజేపీ నాయకులు.. ఇటీవల విశాఖపట్నంలో పవన్‌పై విధించిన ఆంక్షలను కూడా ఖండించలేదు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లేదా జివిఎల్ నరసింహారావు వంటి ఇతర బిజెపి నాయకులను పక్కన పెట్టండి. పురందేశ్వరి కూడా పవన్ కళ్యాణ్‌పై వైసీపీ వైఖరిని, వైజాగ్‌లో పవన్ ర్యాలీపై విధించిన ఆంక్షలను ఖండించలేదు.
మరోవైపు ఇటీవల ఒంగోలులో జరిగిన బీజేపీ సర్పంచ్‌ల ధర్నా కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమని సూచించారు. కానీ బీజేపీ నేతల నుంచి జనసేన నేతలకు వస్తున్న ఆదరణ అంత ప్రోత్సాహకరంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఓ వైపు పొత్తు ఉన్నట్టు చెబుతూనే.. మరోవైపు పొత్తు పార్టీపై విమర్శల వర్షం కురుస్తున్నా స్పందించకపోవడం వెనుక రాజకీయ వ్యూహం ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయని టీడీపీ జనసేనకు మద్ధతు పలుకుతుండటం చూస్తుంటే.. రహస్య ఒప్పందం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.