తెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 10:47 AM ISTతెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని అధికార పార్టీ బీఆర్ఎస్ భావిస్తోంటే.. ఈ సారి ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారం చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ దాదాపు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు తొలి విడతగా సగం అభ్యర్థులను ప్రకటించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వలసదారులను.. అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. వారు అడిగిన టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఆ మేరకు అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఈ నెల 22న తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యిన విషయం తెలిసిందే. బీజేపీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు చోటు దక్కలేదు. దాంతో.. వారిద్దరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం. బీజేపీ నాయకత్వంపై వారిద్దరూ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. అంతేకాక తొలివిడతలో వారికి టికెట్ కూడా లభించలేదు. దాంతో.. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి వారిని పార్టీలో చేరాలని ఆహ్వానించింది. ఇక బీజేపీలో ఈటలకు బీజేపీ నాయకత్వం రెండు స్థానాలు కేటాయించింది. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్ నుంచి ఈటల బరిలోకి దిగుతున్న విషం తెలిసిందే. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కోరుతున్నారు. తాన భార్య మునుగోడు నుంచి పోటీ చేస్తుందని.. తాను ఎల్‌బీనగర్ నుంచి బరిలోకి దిగుతానని చెబుతున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ.. తొలి విడతల ఆయన విన్నపానికి తగినట్లుగా ప్రకటన లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీని వీడి తాను ఇంతకుముందున్న కాంగ్రెస్‌లోకి రావాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక రాజగోపాల్‌రెడ్డితో కాంగ్రెస్ నేతలు టచ్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని అనుచరులు కోరుతున్నట్లు మూడ్రోజుల క్రితం స్వయంగా రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. దాంతో.. ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి చేరికపై ఏక్షణమైనా ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రెండో జాబితా అభ్యర్థుల లిస్ట్‌కు ఆమోదముద్ర పడనుంది. అయితే.. ఇతర పార్టీల నుంచి వలసలు జరగొచ్చని భావిస్తోన్న అధిష్టానం.. రెండో జాబితాను 30 మందికే కుదించాలని భావిస్తోంది. దాంతో..చేరికల తర్వాత మూడో జాబితా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సీపీఐ, సీపీఎంల సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. రెండు పార్టీలకు రెండేసి అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.