దావా వేసి కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారు : మల్లు రవి

Mallu Ravi Comments On Minister KTR. తెలంగాణలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని

By Medi Samrat  Published on  21 Sep 2021 10:33 AM GMT
దావా వేసి కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారు : మల్లు రవి

తెలంగాణలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మల్లు రవి అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేస్తే.. అక్కడకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేసుకోకుండా.. పరువునష్టం అనడం కేటీఆర్‌ అవివేకమ‌ని అన్నారు. ప్రజా ప్రతినిధులు టెస్ట్ లు చేయించుకొని ఆదర్శంగా ఉందామని రేవంత్ రెడ్డి అంటుంటే అది పరువునష్టం ఎలా అవుతుందని ప్ర‌శ్నించారు. కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తే కోర్టు కొట్టేసిందని.. పరువు నష్టం దావా వేసి కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

కేటీఆర్, రాహుల్ గాంధీతో పోల్చుకోవడం ఏమిటీ.? కేటీఆర్ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్, రేవంత్ రెడ్డి ఎంపీగా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరితే ఇక్కడకు రాకుండా ఢిల్లీకి పోతామని అనడం ఆయన భయానికి నిదర్శనమ‌ని అన్నారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పెద్ద నాయకులని.. ఆయన పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు.

మంత్రి మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండించాల్సిన కేటీఆర్.. ఆయనకు మద్దతు పలికారని మ‌ల్లు ర‌వి అన్నారు. రేవంత్ రెడ్డి విసిరిన తెలంగాణ డ్రగ్ ఫ్రీ వైట్ ఛాలెంజ్ ను కేటీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మహా ధర్నా ఉందని.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ధరల పెరుగుదల, వ్యవసాయ బిల్లులు, ఉపాధి హామీ రోజుల పెంపు, కూలి ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తదితర అంశాలపై ఉద్యమం ఉంటుందని అన్నారు.


Next Story