ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని అన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్లలేరని చెప్పారు. పది అడుగుల పాదయాత్ర చేసి జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్ జగన్ మాదిరిగా ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ తాను ఏ సిద్దాంతం ఎన్నుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు.
కమ్యూనిస్టులు, టీడీపీలతో కలిసి పనిచేసిన వ్యక్తి టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్‌లైన్ టికెట్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. నాయకులు అయిన వాళ్లు మంచి వైపు నిలబడాలని.. జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని.. ఆయన జోలికి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు.
పోసాని భార్యకు దారుణమైన అవమానం జరిగిందని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే స్థాయికి టీడీపీని దిగజార్చారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అని.. చంద్రబాబు వారసత్వాన్ని లోకేశ్, పవన్ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలకు తిలోదకాలిచ్చారన్నారు. మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ సాగిస్తున్న దాడులు ఇక ఎంతోకాలం సాగబోవన్నారు.