రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేకపోతున్నారు:పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం తీరుని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తప్పుబట్టారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2023 10:21 AM GMT
Congress, Rahul Gandhi, BJP, PM Modi, Ponnam Prabhakar,

 రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేకపోతున్నారు:పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం తీరుని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హతపై స్టే కోసం వేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్‌ చేశారు. వేములవాడలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

భారత్‌ జోడోయాత్ర తర్వాత రాహుల్‌గాంధీకి ఆదరణ పెరుగుతోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా నరేంద్ర మోదీ, అదానీ స్నేహబంధం గురించి రాహుల్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారని గుర్తు చేశారు. కక్షపూరితంగా న్యాయవ్యవస్థను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. పాత కేసు పేరుతో రాహుల్‌గాంధీని పార్లమెంట్‌ నుంచి బహిష్కరించడాన్ని పొన్నం ప్రభాకర్‌ తప్పుబట్టారు. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని ప్రజలంతా గమనించాలని కోరారు.

తెలంగాణలో బీజేపీకి జరిగిన డ్యామేజ్‌ని కంట్రోల్‌ చేసుకునేందుకు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. గతంలోనే సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారని.. రూ.3500 కోట్లు, 30వేల ఉద్యోగాలని చెప్పి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన టెక్స్‌టైల్‌ పార్క్‌కు మళ్లీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారా అని ప్రశ్నించారు. సిరిసిల్లకు టెక్స్ టైల్ పార్కును ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు టెక్స్ టైల్ పార్కు ప్రారంభించిన చోట మళ్లీ ఎందుకు ప్రారంభిస్తున్నారని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.

Next Story