రాష్ట్రం ఇచ్చామని ఒకరు.. అభివృద్ధి చేస్తున్నామని మరొకరు.!
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణం ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతల మధ్య
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sept 2023 7:45 PM ISTహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణం ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతల మధ్య దీని గురించి ఎంతో చర్చ జరుగుతూ ఉంది. ఎప్పటి నుండో చర్చ జరుగుతూ ఉంది. సోనియా గాంధీ ఇవ్వకపోయింటే ప్రత్యేక తెలంగాణ వచ్చి ఉండేదా? అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉండగా.. కేసీఆర్ పోరాటం చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల సోనియా గాంధీ, తెలంగాణ మ్యాప్ ఉన్న వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ వీడియోపై BRS శ్రేణులు విమర్శలు గుప్పించాయి.
కేసీఆర్ పాత వీడియోను విడుదల చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్‌దేనని సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న సమయంలో అధికార కాంగ్రెస్‌ను ప్రజలు హెచ్చరించారని, ఆ పార్టీకి తెలంగాణలో స్థానం ఉండదని భయం పట్టుకోవడంతోనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు కేటీఆర్.
కేటీఆర్ స్టేట్మెంట్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. "సోనియాగాంధీ చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. అందులో ఎలాంటి సందేహం లేదు.” అని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో ఉంది.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇప్పుడు కేసీఆర్ పాత వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తోంది. మీ పార్టీ అధ్యక్షుడి మాట వినాలని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వ్యక్తుల గురించి తెలుసుకోవాలని కేటీఆర్‌ను కోరారు రేవంత్ రెడ్డి.
గాంధీలపై విరుచుకుపడ్డ కవిత:
మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సెప్టెంబరు 13న జగిత్యాలలో జరిగిన సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుపై వ్యాఖ్యలు చేసే ముందు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలను కోరారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వాగ్దానాలు చేశారా? తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేరుస్తుందని నమ్మేందుకు ఒక్క ఉదాహరణ అయినా ఉందా? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పి తెలంగాణకు రావాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు, రైతు బిల్లు, ఇతర చట్టాల స్థితిగతులపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని, ఆ తర్వాత తెలంగాణ ప్రజలతో మాట్లాడాలని ఆమె అన్నారు.
5 హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ:
అధికార పార్టీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తెలంగాణలో మెగా ఈవెంట్‌కు కాంగ్రెస్ సిద్ధమైంది. సెప్టెంబరు 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం రూపంలో రాష్ట్ర ప్రజలు ఒక మెగా ఈవెంట్ ను చూడబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవ్వబోతోంది. ప్రజలకు ఇవ్వబోయే హామీలను ఈ సమావేశంలో తెలియజేయనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 1:00 గంటలకు టీపీసీసీ ఇచ్చే లంచ్‌కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. 17న ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సాయంత్రం 5:00 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొంటారు. 18న ఎంపీలు మినహా మిగతా నాయకులంతా 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
సెప్టెంబర్ 17న ఉదయం సీడబ్ల్యూసీ సభ్యులు ఎన్నికలలో అమలు చేయాల్సిన వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించేందుకు సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 'ఐదు హామీలు' ప్రకటించనుంది. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, మైనార్టీలు, హైదరాబాద్ లోని పాతబస్తీ వాసులకు కోసం ఈ ఐదు హామీలు రూపొందించారని అంటున్నారు. పింఛను, గృహ నిర్మాణ పథకాలపై హామీలు ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ప్రజలకు కోటి గారంటీ కార్డులను పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 18న కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు, రాష్ట్ర నేతలతో కలిసి 100 నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్:
తెలంగాణలో 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి టిక్కెట్లు పంపిణీ చేసింది. వారిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అభ్యర్థులు గ్రౌండ్ లెవెల్లో తమ పార్టీ నేతలతో ఎన్నికలలో గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాంగ్రెస్ నేతలు హామీలను నెరవేర్చగలరా’ అని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. BRS కాంగ్రెస్ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి, ప్రజల్లో మరింత మమేకమవ్వడానికి మరిన్ని మార్గాలను అన్వేషిస్తోంది.