2018 కంటే బీఆర్‌ఎస్ 5-6 సీట్లు ఎక్కువనే గెలుస్తుంది: కేసీఆర్

గత ఎన్నికలతో పోలిస్తే.. వచ్చే ఎన్నికల్లో 5-6 సీట్లు అధికంగా గెలుస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ చెప్పారు.

By అంజి  Published on  21 Aug 2023 1:00 AM GMT
BRS, KCR, Telangana, Suryapet

2018 కంటే బీఆర్‌ఎస్ 5-6 సీట్లు ఎక్కువనే గెలుస్తుంది: కేసీఆర్

హైదరాబాద్‌ : ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధిస్తుందన్న నమ్మకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నాడు భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) 2018 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే 5-6 సీట్లు ఎక్కువగా గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుపై ​​ఎలాంటి సందేహాలు లేదన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 5-6 సీట్లు అధికంగా గెలుస్తామని ఆయన చెప్పారు. 2018లో 119 స్థానాలున్న అసెంబ్లీలో 88 స్థానాలు గెలుచుకుని టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడిన కేసీఆర్.. ఎన్నికల కోసం కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చారని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటిని నమ్మవద్దని బీఆర్‌ఎస్ చీఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క అవకాశం కోరుకుంటున్నారు. గత 50 ఏళ్లలో ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీనియర్ సిటిజన్లు, వితంతువులు, ఇతరులకు నెలకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తోందని బీఆర్‌ఎస్ చీఫ్ చెప్పారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4,000 పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తాము పెన్షన్‌ పెంచుతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే పెన్షన్‌ పెంపుదల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాల, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల నూతన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారని, అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీల గురించి ఏనాడూ ఎందుకు ఆలోచించలేదో చెప్పాలన్నారు.

నల్గొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ రైతు వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని బీజేపీ చెబుతుంటే, రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ చెబుతోందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని కేసీఆర్ అన్నారు. రెండు దఫాలుగా రూ.37,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను దళారుల ప్రమేయం లేకుండా అమలు చేస్తున్నామని, ధరణి పోర్టల్‌ను రద్దు చేసి మధ్యవర్తుల వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ లేకుండా రైతు బంధు, రైతుబీమా ఎలా అమలు చేస్తారని కేసీఆర్‌ ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌తో కేవలం 15 నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్‌ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటు ద్వారానే తమ భవితవ్యాన్ని తామే రాసుకోవాలని, ప్రజలు తమ ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.

Next Story