మోదీ ప్రియమైన ప్రధాని కాదు..పిరమైన ప్రధాని: కేటీఆర్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్‌ కనిపిస్తోంది

By Srikanth Gundamalla  Published on  3 April 2024 11:15 AM GMT
brs, ktr, comments,  congress, bjp, telangana, lok sabha election,

మోదీ ప్రియమైన ప్రధాని కాదు..పిరమైన ప్రధాని: కేటీఆర్ 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్‌ కనిపిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు కొందరు నాయకులు పార్టీలు మారుతూ ఉండటంతో పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్‌లో చేవెళ్ల లోక్‌సభ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే.. బీఆర్ఎస్‌ను మోసం చేసి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డిపై మండిపడ్డారు.

దేవుడిని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మాట్లాడితే రాముడికి దండం పెడదాం.. మోదీకి ఓటు వేద్దాం అంటున్నారని చెప్పారు. హిందువులం కాబట్టి తప్పకుండా రాముడికి మొక్కుదాం అనీ.. కానీ ఓటు వేసే ముందుకు చేవెళ్లకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించాలని కోరారు. రైల్వే లైన్ ప్రకటించారా? ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. అందుకే రాముడికి మొక్కుదాం.. బీజేపీని లోక్‌సభ ఎన్నికల్లో తొక్కుదాం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు కరువు అయ్యారని అన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, నల్లగొండ, వరంగల్‌లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ అభ్యర్థులుగా నిలబెట్టారని చెప్పారు. సికింద్రాబాద్‌లో ఒక్క కిషన్‌రెడ్డి మాత్రమే ఆ పార్టీ నాయకుడు అని కేటీఆర్ చెప్పారు. ఏదైనా అంటే మోదీ అంటున్నారు కానీ.. మోదీ ప్రియమైన ప్రధాని కాదు అనీ.. పిరమైన ప్రధాని అంటూ విమర్శలు చేశారు. మోదీ హయాంలో అన్ని ధరలను పెంచేసి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విశ్వాసం లేని నాయకుడు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఒక రన్నింగ్‌ రెడ్డి అంటూ విమర్శలు చేశారు. పట్నం మహేందర్‌రెడ్డి, రింజిత్‌రెడ్డిలకు నటనలో అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. రాజకీయాల్లో ఓడినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. ఒక వేళ అధికారంలోకి మళ్లీ బీఆర్ఎస్‌ వచ్చి ఉంటే కాంగ్రెస్‌లోకి రంజిత్‌రెడ్డి వెళ్లేవాడా అని ప్రశ్నించారు. స్వార్థం కోసమే పార్టీ మారారు అని ఆరోపించారు. రంజిత్‌రెడ్డి ఇంటికి వస్తే చాయ్‌ ఇచ్చి ఓదార్చండి.. కానీ కచ్చితంగా ఓడగొడతామని చెప్పండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Next Story