నిధులు మళ్లించిన కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్

కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్‌లను అస్సలు పట్టించుకోలేదు అని బండి సంజయ్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  29 Jan 2024 7:40 AM GMT
bandi sanjay, comments,  brs, ktr, kcr, telangana ,

నిధులు మళ్లించిన కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్

కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్‌ నిధులు రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్‌ ప్లాంట్‌ను ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్‌లను అస్సలు పట్టించుకోలేదు అన్నారు. వారికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిధులను దారి మళ్లించి సర్పంచ్‌లను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారి మళ్లించినందుకు గాను మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులకు సర్పంచ్‌ల గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను తీసుకొచ్చారని మండిపడ్డారు.

తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధిస్తుందని బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనుందని చెప్పారు. ఆ తర్వాత ప్రజల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించబోతుందని అన్నారు. బీజేపీనే 350 వరకు సీట్లను గెలుస్తుందని అన్నారు. ఇండియా కూటమి దిక్కులేని నావా.. రోజురోజుకి ఆ కూటమి నుంచి నాయకులు బయటకు వస్తున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అంతే ఉందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్‌లో కేటీఆర్‌ను పట్టించుకునే పరిస్థితే లేదన్నారు.

గత ప్రభుత్వం సర్పంచ్‌లను పట్టించుకోలేదని.. వారి సమస్యలు తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వమయినా పట్టించుకోవాలని బండి సంజయ్‌ కోరారు. పదవి కాలం ముగుస్తున్న సర్పంచ్‌లకు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనీ.. కేంద్రం నేరుగా సర్పంచ్‌లకు డబ్బులు ఇస్తే గత సీఎం మాత్రం నిధులను దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. సర్పంచ్‌లు వారు చేసిన పనులకు బిల్లులు రాక ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారని చెప్పారు. ఏకగ్రీవ పంచాయితీలకు నిధులు ఇవ్వకుండా వారిని బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. సర్పంచ్‌లు చేస్తున్న పోరాటాలకు బీజేపీ మద్దతు ఉంటుందనీ.. వారిది న్యాయమైన పోరాటమని బండి సంజయ్ చెప్పారు.

Next Story