పోటీ ఎమ్మెల్యేగానా, ఎంపీగానో అధిష్టానానిదే నిర్ణయం: బండి సంజయ్

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? లేదంటే ఎంపీగా పోటీ చేయాలా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2023 6:35 AM GMT
Bandi Sanjay, BJP , Telangana, Elections, BRS,

పోటీ ఎమ్మెల్యేగానా, ఎంపీగానో అధిష్టానానిదే నిర్ణయం: బండి సంజయ్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ జాబితా సిద్దం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇక బీజేపీ కూడా ఎక్కువ సీట్లను గెలిచేలా.. ఇతర పార్టీల్లో టికెట్ లభించినవారిని ఆహ్వానించేలా కరసత్తు చేస్తోంది. ఇక బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు.

ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. నార్త్ కరోలినా చార్లోటేలోని హిందూ సెంటర్ లో ‘‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుపై ప్రవాస భారతీయులు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పారు బండి సంజయ్. మజ్లిస్‌ పార్టీతో బీఆర్ఎస్‌ అంటకాగుతోందని.. బీఆర్ఎస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటామని ప్రశ్నించారు. ఆ ఆలోచనకే తావు లేదని చెప్పారు. అయితే.. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? లేదంటే ఎంపీగా పోటీ చేయాలా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. హైకమాండ్‌ నిర్ణయం మేరకే నడుచుకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

కుటుంబ పాలనలో ఉన్నప్పుడు దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పారు బండి సంజయ్. అప్పుడు అవినీతి పరులు ఎక్కువగా ఉండేవారని.. జవాబుదారీతనం ముచ్చుకైనా కనిపంచలేదని అన్నారు. ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్లు అప్పటి పాలకులు వ్యవహరించే వారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని తెలిపారు. ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్‌ను ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘతన ప్రధాని మోదీదే అని చెప్పారు. అందుకే మోదీ సర్కార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. రాబోయే ఎన్నికల్లో మోదీ తరఫున ప్రచారం చేయాలని ప్రవాస భారతీయులను బండి సంజయ్ కోరారు.

Next Story