గెలుపు ఉత్సాహం.. ఏపీపై కన్నేసిన కాంగ్రెస్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, చిరకాల ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తోంది.

By అంజి  Published on  27 Dec 2023 3:45 AM GMT
Telangana, Congress, Andhra Pradesh, Rahul Gandhi

గెలుపు ఉత్సాహం.. ఏపీపై కన్నేసిన కాంగ్రెస్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, చిరకాల ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో వైసీపీని ఢీకొట్టాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సీట్లు గెలవకపోయినా, తన ఓట్ల శాతాన్ని సంపాదించుకోవాలని, రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ప్రతికూలతను నెమ్మదిగా తొలగించుకోవాలని చూస్తోంది.

రాష్ట్రంలో ఎలాంటి పొత్తులు పెట్టుకోవాలో కూడా చూస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే, లోక్‌సభ ఎన్నికలపైనే కాంగ్రెస్‌ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. ఏపీలో ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ వ్యూహం, కార్యాచరణపై చర్చించేందుకు కీలక నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ రాష్ట్ర నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర నేతల వ్యూహం, సంసిద్ధతపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండా. అవసరమైతే, లోక్‌సభ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ కోరవచ్చు.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిచ్చి పోటీని విరమించుకున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి మద్దతిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ అంశాలన్నీ ఏపీలో పరిస్థితిని, కాంగ్రెస్ భవిష్యత్తును ఆసక్తికరంగా మార్చాయి. పుకార్లు నమ్మితే, కాంగ్రెస్ కూడా వైఎస్ షర్మిలను రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కోరవచ్చు. ఇవన్నీ సాగుతున్న ఊహాగానాలే. ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలోనూ కాంగ్రెస్ ఇప్పటికే విజయం సాధించడం గమనార్హం. దీన్నిబట్టి కాంగ్రెస్ మెల్లమెల్లగా తన బలాన్ని కూడగట్టుకుని దక్షిణ భారతదేశంలో తన ఉనికిని పెంచుకుంటోంది.

Next Story