గన్నవరంలో పొలిటికల్ హీట్.! ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీకి లాభం.?
By Medi Samrat Published on 30 Oct 2019 5:34 PM ISTగన్నవరం రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. దీపావళి నాడు తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా లేక స్పీకర్‌కు పంపారా? లేదా? అనే విషయం తెలియదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాజీనామా లేఖ పంపారు. కానీ వంశీ రాజీనామాపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీకి మాత్రమే రాజీనామా చేశారా? ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారా? సరైన ఫార్మాట్‌లో స్పీకర్‌కు పంపారా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.
వంశీ రాజీనామా స్పీకర్ చేరితే ఏం జరుగుతోంది? అనేది ఇంపార్టెంట్. రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే... ఆరునెలల్లో గన్నవరంలో ఉప ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. గన్నవరం టీడీపీ సిట్టింగ్ సీటు. ఆ పార్టీ తరపున వంశీ మళ్లీ తిరిగి పోటీ చేసే అవకాశం లేదు. మొన్నటి ఎన్నికల్లో వంశీ కేవలం 838 ఓట్ల తేడాతో గెలిచారు.
వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకి లక్షా 3 వేల 43 ఓట్లు వచ్చాయి. వంశీకి లక్షా 3 వేల 881 ఓట్లు పడ్డాయి. ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా పోటీ చేసిన సీపీఐకి 6675 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో మూడు శాతం.
ప్రధాన పార్టీలకు ఉప ఎన్నిక సవాల్ !
వంశీ రాజీనామా ఆమోదం పొందితే ప్రధాన పార్టీలకు సవాలే. అధికార వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తమ అభ్యర్థులను బరిలో దింపడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ, బీజేపీలను పక్కన పెడితే.. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు ఉప ఎన్నిక ద్వారా ఓపరీక్ష ఎదురుకాబోతుంది.
కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న కృష్ణా జిల్లాలో విజయవాడ శివార్లలో ఉండే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. మొదట్లో కమ్యూనిస్టులు ఈ స్థానంపై ఆధిపత్యం ఉండేది. క్రమంగా వారు ప్రాభవాన్ని కోల్పోయారు. 2009, 2014 సహా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 2009లో దాసరి బాలవర్ధన్ రావు ఇక్కడి నుంచి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వంశీ విజయం సాధించారు. ప్రస్తుతం దాసరి బాలవర్ధన్ రావు టీడీపీలో లేరు. ఆయన వైసీపీలో ఉన్నారు.
లోకేష్ బరిలోకి దిగుతారా? పవన్ పోటీకి సై అంటారా?
టీడీపీకి బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలో నారా లోకేష్ ను బరిలో దించే అవకాశాలు లేకపోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన మంగళగిరిలో ఓడిపోయారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వంశీ రాజీనామా వల్ల ఖాళీ అయిన గన్నవరంలో లోకేష్ ను పోటీ చేయించాలనే డిమాండ్ ఊపందుకోవడానికి ఎంతోో సమయం పట్టకపోవచ్చు. దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే చంద్రబాబు నాయుడే. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కూడా ఉప ఎన్నిక టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షే. ఎందుకంటే- ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాను టీడీపీ మనిషిని కాదని నిరూపించుకోవడానికి ఉప ఎన్నిక ఆయనకు అందివచ్చిన అవకాశం. ఈ పరిస్థితుల్లో ఆయన పవన్ కల్యాణ్.. పార్టీ అధ్యక్షుడిగా తానే పోటీ చేస్తారా? లేక అభ్యర్థిని నిలబెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇటు వైసీపీ తన తొలి ఆరునెలల పరిపాలనపై ఇది ప్రజా తీర్పుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి. అధికార పార్టీగా ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారుతుంది.