యోగి ఆదిత్యనాథ్ పేరు పలకడంలో మోదీ చేసిన పొరపాటు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 10:43 AM GMT
యోగి ఆదిత్యనాథ్ పేరు పలకడంలో మోదీ చేసిన పొరపాటు..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం భూమి పూజ పూర్తయింది. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని.. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు.

దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని చెప్పారు. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని చెప్పారు. అయోధ్య భూమిపూజలో పాలుపంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు.

ఇదే కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరైన సంగతి తెలిసిందే..! ఆయన పేరు పలికే సమయంలో మోదీ 'ఆదిత్య యోగినాథ్ జీ' అని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ అనడానికి బదులుగా మోదీ ఆదిత్య యోజనాథ్ జీ అని పిలిచారు. ఆయన పలికిన ఈ తప్పుపై నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇంతకూ ఆదిత్య యోగినాథ్ జీ ఎవరూ అంటూ ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'ఉత్తరప్రదేశ్ ఉర్జవాన్, యశస్వీ లోకప్రియ ముఖ్యమంత్రి శ్రీమాన్ ఆదిత్య యోగినాథ్ జీ' అని అన్నారు మోదీ.. ఏదో చిన్న పొరపాటు అయినప్పటికీ నెటిజన్లు మాత్రం పలు పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ఆయన అలా అన్నారో లేదో ఆదిత్య యోగినాథ్ అన్న పేరు ట్విట్టర్ లో ట్రెండింగ్ కు వచ్చింది. వీటిపై మీమ్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్ అధికారం చేపట్టాక పలు ప్రాంతాల పేర్లు మార్చారు. ఇప్పుడు ఆయన పేరును మోదీ మార్చారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

రామ మందిరం భూమిపూజ మహోత్సవంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ ను విలేకరులు ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగారు. అయోధ్యలో జరగబోయే మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అని.. ఈ ప్రశ్నకు యోగి సమాధానం చెబుతూ మసీదు శంకుస్థాపనకు తనను ఎవరూ పిలవరని అన్నారు. తనను పిలవనప్పుడు తాను వెళ్లనని చెప్పారు. తన పనిని ఒక కర్తవ్యంగా, ధర్మంగా భావిస్తానని.. అన్ని మతాల ప్రజలు శాంతిసామరస్యాలతో కలిసి, మెలిసి బతకాలని తాను కోరుకుంటానని చెప్పారు.

Next Story
Share it