ట్విటర్‌లో మోదీ హవా.. ఆరు కోట్లు దాటిన ఫాలోవర్స్
By Medi Samrat Published on 20 July 2020 6:04 AM GMTప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మోదీ మరో ఘనతను సాధించారు. తాజాగా ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్‌ను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు ఆరు కోట్ల మార్కును దాటింది.
2009 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ ను ప్రారంభించారు. అప్పటి నుండి ఆయన ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయాన్ని పంచుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా 2,354 మందిని అనుసరిస్తున్నారు. పాలనా, రాజకీయ పరమైన విషయాలను మోదీ ట్విటర్ వేదికగా ప్రజలతో షేర్ చేసుకుంటారు.
ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ట్విటర్ ఫాలోవర్స్ కలిగి ఉన్న నాయకుల్లో ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 12 కోట్ల 70 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 కోట్ల 37 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.