ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 3:00 AM GMT
ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం

ట్విట్టర్‌ కు పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల ట్విట్టర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు నోటీసు జారీ చేసింది. హ్యాక్‌కు గురైన ఖాతాలలో భారతీయుల ఖాతాల వివరాలను అందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై సాధ్యమైనంత తొందరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు శనివారం జారీచేసిన నోటీసులో పేర్కొంది. మాల్వేర్లు, ఇతర వైరస్ లతో కూడిన ట్వీట్లు, లింకులను ఎంతమంది భారతీయులు క్లిక్ చేశారు? వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారా లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని ట్విట్టర్‌‌ను కోరింది. అంతే కాకుండా హ్యాకింగ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు ట్విట్టర్‌‌ తీసుకున్న చర్యలు ఏమిటి? అని కూడా సెర్ట్ తన నోటీసుల్లో ప్రశ్నించింది.

సైబర్ నేరగాళ్లు ఈ మధ్య రెచ్చిపోతున్నారు ఏకంగా రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొగల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్‌ అకౌంట్లను హ్యాక్‌ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తో పాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్‌ అయ్యాయి. వారికి తెలియకుండానే వారి ట్విట్టర్ ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్ట్ చూసి వెంటనే వారు అప్రమత్తం అయ్యారు. హ్యాక్‌ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్‌ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్‌ కావడం ఇదే మొదటిసారి.

Next Story
Share it