మమ్మల్ని కాపాడండి : జీజీహెచ్‌లో తల్లి ఆవేదన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 1:35 PM GMTగుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల బాలుడు, తల్లి కరోనాతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరారు. అయితే.. మూడు రోజులుగా వైద్యులు, సిబ్బంది తల్లి, బిడ్డను పట్టించుకోలేదు. దీంతో.. మమ్మల్ని వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తల్లి సెల్పీ వీడియోలో అవేదన వ్యక్తం చేసింది.
గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తన బిడ్డకు అనారోగ్యం కారణంగా జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్లింది. అయితే అనారోగ్య కారణాలతో ఎవరు ఆసుపత్రికి వచ్చినా.. వారికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించాలని జీజీహెచ్ వైద్యులు నిబంధన పెట్టారు. దీంతో ఆ తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఇద్దరికీ కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే.. పాజిటివ్ వచ్చినప్పటి నుండి తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ తల్లి వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇద్దరికీ కరోనా ఉందని తేలడంతో.. వార్డులోకి వైద్యులు, ఇతర సిబ్బంది ఎవరూ రావడం లేదని.. మందులు కూడా బయట నుంచి తెచ్చుకోవాలని వైద్యులు చెప్తున్నారని కన్నీటి పర్యంతమయ్యింది.
అయితే, మందులు తెచ్చుకున్నప్పటికీ ఇంజక్షన్స్ లోడ్ చేసి ఇవ్వకుండానే సిబ్బంది వెళ్లిపోయారని.. ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది ఇంజక్షన్స్ చేయడం లేదని.. తనను, బిడ్డను కాపాడాలంటూ ఆ తల్లి సెల్ఫీ వీడియోలో వాపోయింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఎప్పటికప్పుడు మీడియలో కథనాలు వెలువడుతున్నప్పటికీ.. వారిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు సరికదా.. వారి నిర్లక్ష్యం కారణంగా అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.