వాయించేసిన కాయగూరలమ్మి.. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడ్డంతో అధికారులు షాక్!
By మధుసూదనరావు రామదుర్గం Published on 25 July 2020 5:28 AM GMTరోడ్డు పక్కన తోపుడు బళ్ళపై కాయగూరలు, పండ్లు అమ్ముకుంటున్న బడుగుజీవులపై మునిసిపల్ అధికారులు కొరడా ఝళిపించారు. ఎన్నిసార్లు చెప్పాలి రోడ్డు పై మీ కొట్టు తెరవొద్దని.. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని ఏం పిచ్చపిచ్చగా ఉందా అంటూ చెడామడా తిడుతూ ఓ తోపుడు బండిని పక్కకు తోసేశారు. ఈ బండి తాలూకు యువతికి ఎక్కడ్లేని కోపం ముంచు కొచ్చింది. నాల్గు మెతుకుల కోసం అష్టకష్టాలు పడి తోపుడు బండిపై చిన్న వ్యాపారం చేసుకుంటుంటే.. దాన్ని కూడా అడ్డుకుంటూ కడుపులు కొట్టే అధికారుల తీరు పై ఆవేశం కట్టలు తెంచుకుంది.
అంతే ఏం ఎందుకు మా బండ్లను తోసేస్తున్నారు? బతుకు తెరువు కోసం మరో దారి లేక చిన్నపాటి అమ్మకాలు సాగిస్తుంటే మీ కంటికి మేం దందా చేస్తున్నట్టనిపిస్తుందా? పేదరికంలో మగ్గి పోతున్న మా ఆకలి బాధలు మీకు తెలుసా? కనీసం ఊహించగలరా? అంటూ రెచ్చిపోయింది. ఆ ఆవేశంలో ఇంగ్లిష్ లో అనర్గళంగా అధికారులతో వాదించింది. ఆమె భాష విన్న అధికారులు, చుట్టు పక్కల వాళ్లు అవాక్కయిపోయారు. వెంటనే అధికారులు ఆరా తీస్తే ఆమె అసలు కథ ఏంటో తెలిసింది.
రైసా అన్సారి రోడ్డు పక్కన కాయగూరలమ్ముకునే చిరు వ్యాపారిగానే అందరికీ తెలుసు. కానీ ఆమె ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేని విషయమేంటంటే తను డాక్టరేట్ పట్టా అందుకున్న ఉన్నత విద్యావంతురాలని. రైసా ఇండోర్ లోని దేవి అహల్యా విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్ సైన్స్ లో పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టా అందుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ తోపాటు రీసెర్చికూడా చేసి పీహెచ్ డీ సాధించిన ఆ పేదయువతికి ఉద్యోగావకాశాలు రాలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుటుంబాన్ని పోషించుకోడానికి గత్యంతరం లేకుండా రోడ్డుపక్కనా కాయగూరలమ్మి అవతారం ఎత్తాల్సి వచ్చింది.
దరిద్రానికి దాసోహమని జీవితంలో ఇన్ని మెట్లు దిగి చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటే.. మునిసిపల్ అధికారులు నిత్యం రూల్స్ పేరిట హింసించడాన్ని తట్టుకోలేక పోయింది. పేదలకు బతికే హక్కే లేదా అని మనసు ఆక్రోశించింది. ఆవేశంతో అధికారులపై ఇంగ్లిష్‌లో విరుచుకుపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే రైసా అందరి కంట్లో పడింది. అసలే కరోనా విజృంభణతో రోడ్లపక్కన చిరువ్యాపారుల బతుకులు అగమాగమయ్యాయి. పులిమీద పుట్రలా ఈ మునిసిపల్ అధికారుల సతాయింపులు తట్టుకోలేకపోతున్నారు. రైసా మాట్లాడిన ప్రతి మాట వారి పేదరికానికి ప్రాతినిథ్యం వహించేలా ఉంది.
కొన్ని సార్లు మార్కెట్ ఒకవైపు మూసి ఉంటుంది. మరోవైపు అధికారులు మూసేస్తున్నారు. ఈ విపరీత చర్యలతో కాయగూరలు, పండ్లు కొనేవారే కరవైపోయారు. మరి మా కుటుంబాలకు కాసింత అన్నం పెట్టేదెలాగో మీరే చెప్పండి. నేనిక్కడ కాయగూరలు, పండ్లు అమ్ముతున్నాను. చుట్టుపక్కల అమ్మేవారు కూడా నా కుటుంబ సభ్యులు , స్నేహితులు. మా కుటుంబంలో 20 మందికి పైగా ఉన్నాం. మా నాన్నకు 70 ఏళ్లు తాను కూడా పండ్లు అమ్ముతుంటాడు . కానీ ఇలా వ్యాపారం సాగకుండా అడ్డుకుని కడుపులు కొడుతుంటే మేమంతా ఏం తినాలి? ఎలా బతకాలి? అసలు ఇక్కడ రద్దీ అన్నమాటే లేదు. అయినా సరే అధికారులు వెళ్లిపోండి అంటూ తెగ హడావుడి చేస్తున్నారు....అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది రైసా.
రైసా ఇంగ్లిష్ వాగ్ధాటి చూసిన అధికారులు మొదట షాక్ అయినా తేరుకుని ఆమెతో ఇంగ్లిష్ లోనే మాట్లాడారు. ఎన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నావు అంటే చాలా కాలం నుంచి అని చెప్పింది. ఇంతకూ ఏం చదువుకున్నావు అని అడిగితే డాక్టరేట్ చేశానని రైసా బదులిచ్చింది. మరి ఇంత చదువు చదివావు మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే.. పనికిరాని తక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు ఎలా చేయాలని ఎదురు ప్రశ్నించింది.
అలా కాదు మనసు పెట్టి ప్రయత్నించవచ్చు కదా అని అధికారులు అంటే.. అన్నీ ముగిశాయి. అయినా నాకు ఎవరిస్తారు ఉద్యోగం. కరోనా ముస్లింల నుంచే వచ్చిందని చాలామంది అన్నారు.. అంటున్నారు. నాపేరు రైసా అన్సారి కావడంతో ఏ కాలేజీ , రీసెర్చి సెంటర్ నాకు ఉద్యోగం ఇచ్చేందుకు సుముఖంగా లేదు.. అంటూ కుండబద్దలు కొట్టింది. సమాజంలో చాలామందికి ఉన్న అవగాహనరాహిత్యానికి రైసా మాటలు అద్దం పడుతున్నాయి.
ఒక్క రైసా అన్సారే కాదు కరోనా విలయంతో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్లపై పడ్డారు. లక్షలాది కుటుంబాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. ఇండోర్ లో ఇప్పటిదాకా 6,457 కేసులు నమోదయ్యాయి. గతనెల నుంచి ఈ సెంటర్ లో చిరు వ్యాపారుల అమ్మకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. కరోనా భయంతో కొనేవాళ్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. దీంతో హాకర్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది. కొందరు ఈ సంక్షోభానికి భయపడి ఎటూ పాల్సోని స్థితిలో కుమిలిపోతున్నారు. ఈ కరోనా ఇలాగే కొనసాగితే ...వైరస్ తో చనిపోవడం కాదు ఆకలి తాళలేక చాలామంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది.