నోట్ల ర‌ద్దు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ప‌డ్డారో.. టిక్‌టాక్ నిషేదం వ‌ల్ల కూడా‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 4:36 PM IST
నోట్ల ర‌ద్దు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ప‌డ్డారో.. టిక్‌టాక్ నిషేదం వ‌ల్ల కూడా‌..

టిక్‌టాక్‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై దేశ‌వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా.. బెంగాలీ న‌టి, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం.. టిక్‌టాక్‌ నిషేధంపై కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. టిక్‌టాక్ అనేది కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ మాత్రమేనని అన్నారు. ఈ యాప్‌పై నిషేధం విధించడం దుందుడుకు చ‌ర్య‌ని ఆమె అభిప్రాయపడ్డారు. టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్ర‌భుత్వాన్ని నిలదీశారు.

ఈ మ‌ధ్యాహ్నం కోల్‌క‌తాలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన శ్రీకృష్ణ ర‌థ‌యాత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నుస్ర‌త్ జ‌హాన్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ను నిషేధించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే చైనాను ఎదుర్కొనే వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది నోట్ల రద్దు సమయంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.



ఇదిలావుంటే.. నుస్రత్ జహాన్ రాజకీయాల్లోకి రాకముందు దాదాపు 20 బెంగాలీ చిత్రాల్లో నటించారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నుస్రత్ జహాన్ బసిర్హట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తృణముల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Next Story