పవన్ సినిమాల్లో కామన్ పాయింట్ గమనించారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2020 9:56 AM GMT
పవన్ సినిమాల్లో కామన్ పాయింట్ గమనించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక మళ్లీ సినిమాలు చేయడేమో అని ఒక దశలో ఆయన అభిమానులు చాలా కంగారు పడిపోయారు. పవన్ కూడా ఇక మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశం లేనట్లు మాట్లాడాడు. కానీ గత ఏడాది ఎన్నికల్లో పరాభవం చవిచూశాక.. తదనంతర పరిణామాలతో పవన్ మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు మూడేళ్ల వ్యవధి పెట్టుకుని.. ఆ సమయంలోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి పవన్ సన్నాహాలు చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదికి తీసుకెళ్లడమే కాదు.. ఇంకో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న వకీల్ సాబ్, క్రిష్ చిత్రం.. వాటి తర్వాత చేయబోయే హరీష్ శంకర్ సినిమా ఎలా ఉండబోతున్నాయనే విషయంలో ఇప్పటికే ఓ అంచనా వచ్చేసింది అభిమానులకు.

పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ పూర్తిగా సామాజిక అంశాలతో ముడిపడ్డ సినిమా. కొందరు అమ్మాయిలపై లైంగిక దాడికి ప్రయత్నించిన కుర్రాళ్లకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడే లాయర్ కథ ఇది. ధీని ఒరిజినల్ ‘పింక్’ జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే తెరతీసింది. సున్నితమైన మహిళల సమస్యల మీద గొప్పగా చర్చించిన చిత్రంగా ‘పింక్’ ప్రశంసలందుకుంది. దీన్ని కొంచెం కమర్షియలైజ్ చేసి తెలుగులో తీస్తున్నారు. మామూలుగా చూస్తే పవన్ లాంటి పెద్ద స్టార్ చేయదగ్గ సినిమా కాదిది. కానీ తన పొలిటికల్ ఇమేజ్‌కు కలిసొస్తుందనే ఉద్దేశంతోనే పవన్ ఇలాంటి సినిమాను రీఎంట్రీకి ఉపయోగించుకున్నాడు.

ఇక క్రిష్ సినిమా సంగతి చూస్తే అదొక రాబిన్ హుడ్ తరహా కథ అంటున్నారు. పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు న్యాయం చేసే బంది పోటు కథ అని సమాచారం. క్రిష్ మామూలుగానే సామాజిక అంశాలతో సినిమాలు చేస్తుంటాడు. పవన్‌తో అనేసరికి మరింతగా సామాజికాంశాలు జొప్పించి ఉంటాడని స్పష్టమవుతోంది. ఇక మామూలుగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లు తీసే హరీష్ శంకర్ సైతం.. ఈసారి పవన్‌ సినిమా కోసం సందేశాన్ని జోడించాడని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.

మొత్తంగా పవన్ సినిమాల వరుస చూస్తుంటే.. ప్రతి దాంట్లోనూ సామాజిక అంశాలు, సందేశం తప్పనిసరి అని అర్థమవుతోంది. ఇంతకుముందులా కేవలం ఎంటర్టైన్మెంట్‌ అంటే మాత్రం పవన్ ఓకే అనేలా లేడు. అల్లరి పాత్రలు అసలే చేసేలా కనిపించడం లేదు. సురేందర్ సినిమా అయినా.. ఆ తర్వాత చేసే మరే సినిమా అయినా సరే.. పవన్ ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటాడని స్పష్టమవుతోంది.

Next Story