145మందితో బయలుదేరిన విమానం.. ఒకే ఒక్క ప్రయాణికుడి .. ఏం జరిగింది.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2020 10:38 AM ISTఆ విమానం ఒకే ఒక్క ప్రయాణికుడితో గమ్యం చేరింది. అదేంటి ఒకే ఒక్క ప్రయాణికుడేంటి.. అనుకుంటున్నారా.? అవును.. సింగపూర్ నుండి వయా కోల్‌కతా మీదుగా చెన్నైకి చేరుకున్న ప్రత్యేక విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడున్నాడు. కేంద్రప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను వందే భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా స్వస్థలానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో బాగంగానే.. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు కోల్‌కతా మీదుగా ఓ ప్రత్యేక విమానం చెన్నై చేరుకుంది. అయితే.. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు దిగేందుకు విమానానికి ఎయిరో బ్రిడ్జ్‌ను జతచేశారు. ఇక అధికారులు కూడా ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
అయితే.. ఆ విమానం నుంచి ఓ 40 ఏళ్ల వ్యక్తి మాత్రమే దిగడంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయమై వ్యక్తిని విచారించగా.. సింగపూర్ నుండి విమానం బయలుదేరినప్పుడు 145 మంది ప్రయాణికులు ఉన్నారని.. 144 మంది ప్రయాణికులు కొల్‌కతాలోనే దిగిపోయారని.. తాను మాత్రమే చెన్నై వచ్చానని బదులిచ్చాడు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు.