కోసేటప్పుడు, కొనేటప్పుడు కన్నీళ్లే.. ఉల్లి కష్టాలు ఎప్పటి వరకు..?

By సుభాష్  Published on  10 Dec 2019 9:31 AM GMT
కోసేటప్పుడు, కొనేటప్పుడు కన్నీళ్లే.. ఉల్లి కష్టాలు ఎప్పటి వరకు..?

ముఖ్యాంశాలు

  • ఉల్లి ధ‌ర‌తో బెంబేలెత్తుతున్న జ‌నాలు
  • ఉల్లి ధ‌ర‌తో బ్లాక్ మార్కెట్‌కు రెక్క‌లు
  • కొందామంటే కొండెక్కి కూర్చున్న ఉల్లి

ఉల్లి క‌న్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిని కొందామ‌న్న కొండెక్కి కూర్చుంది. రోజు రోజుకు ఉల్లి ధ‌ర కొండెక్కుతుందే త‌ప్ప‌, కిందికి రావ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఉల్లి ధ‌ర పెరిగే కొద్ది సామాన్యులు ఆందోళ‌న చెందుతున్నారు. అస‌లు ఉల్లి ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణాలు బాగానే ఉన్నాయి.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామేత ఉంది. ఇప్పుడిదే సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఉల్లిని కోస్తుంటేనే క‌న్నీళ్లు వ‌స్తుంటే.. ఇప్పుడు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ధరలు అధికంగా పెరిగిపోవ‌డంతో పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఉల్లి నిత్య‌వ‌స‌ర స‌రుకుగా మారిపోవ‌డంతో పెరిగిన ధ‌ర‌తో సామాన్యుడి ఇబ్బంది అంతా, ఇంతా కాదు. ఉల్లిగడ్డకు అతిపెద్ద మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్‌ మండీలో కిలో ఉల్లి 50 రూపాయలు దాకా పలుకుతోంది. అది వంటగదికి వచ్చేసరికి దాదాపు ఆ ధ‌ర పైకెళ్లిపోయింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర మార్కెట్లలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి 200 వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. అస‌లు ఉల్లి ధ‌ర ఇంత పెర‌గ‌డానికి అస‌లైన కార‌ణాలేంటీ..? మ‌రి ఇంత ధ‌ర పెరుగుతుంటే ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్నాయ‌నే ప్ర‌శ్న‌లు సామాన్యుల‌లో త‌లెత్తుతున్నాయి.

నిజానికి దేశంలోని ఉల్లి మార్కెట్లలో మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలు ముఖ్య‌మైవి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగా పండిస్తుంటారు. ఈ ఏడాది అధిక వర్షాలు కారణంగా ఉల్లి పంట పూర్తి స్థాయిలో దెబ్బ‌తింది. ఖరీఫ్‌ సీజన్‌లో ఉల్లిసాగు విస్త్రీర్ణం 30 శాతం త‌గ్గిపోయింది. డిమాండుకు అనుగుణంగా సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి ముఖ్య‌కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. 2015-16తో పోలిస్తే గతేడాది అంటే 2016-17లో దేశవ్యాప్తంగా 7.87 లక్షల టన్నుల ఉల్లిగడ్డల అధిక దిగుబడి వచ్చింది. అప్పుడు ధరలు పడిపోవడంతో రైతులు ఈసారి సాగు తగ్గించారు. ఫలితంగా ఇప్పుడు ధరలు ప‌రుగులు పెట్ట‌డ‌వంతో సామాన్యుడికి భారంగా మారింది.

వినియోగదారుడి వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి త‌డిసి మోపెడు:

ఇదంతా ఒక ఎత్తయితే.. ఉల్లి వ్యాపారులు సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని విక్ర‌యాలు కొన‌సాగిస్తుంటారు. అలా మహారాష్ట్ర, క‌ర్నాట‌క‌ తదితర రాష్ట్రాల నుంచి ర‌వాణా చేసుకోవడానికి సుమారు నాలుగైదు రూపాయలు ఖర్చవుతుంది. అక్కడ మార్కెట్లో కిలో ఉల్లి రూ.50కి పైగా ధర పలికితే .. కొనుగోలు, రవాణా ఛార్జీలు కలుపుకొని అది కాస్తా రూ.55 రూపాయలకుపైనే అవుతోంది. ఇక మధ్యవర్తులు, వ్యాపారుల వాటా పోయి.. వినియోగదారుడి సంచిలోకి కిలో ఉల్లి చేరేసరికి ధర తడిసి మోపెడవుతోంది.

ఉల్లి ధ‌ర‌తో బ్లాక్ మార్కెట్‌కు రెక్క‌లు:

ఇక ఉల్లి ధర పెర‌గ‌డం వ‌ల్ల బ్లాక్ మార్కెట్‌‌కు డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలను అంచనా వేసే వ్యాపారులు ఉల్లిని భారీగా గోడౌన్స్‌లో స్టాక్ చేసేస్తున్నారు. ధర రూ.50 రూపాయలు దాటిన తర్వాత కొద్ది కొద్దిగా మార్కెట్లోకి వదిలి కోట్ల రూపాయలు గ‌డిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ బెడ‌ద లేకపోతే రోజుల వ్యవధిలో ధరల ఇంత స్థాయిలో పెరిగేవి కావ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా బెంబేలెత్తిస్తున్న మార్కెట్ బ్రోక‌ర్లు.. ధరలు అంద‌నంత ఎత్తున పెంచేశార‌నేది వాద‌న కూడా ఉంది.

ఇంత ధ‌ర పెరుగుతుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది:

ఒకపక్క ధరలు పెరుగుతుంటే మరి ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని సామాన్యుడి ప్ర‌శ్న‌. ఉల్లిపాయ కేవలం వంటగదికే పరిమితంకాదు. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా కూడా ఉల్లి మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ధరలు నియంత్రించేందుకు ఉల్లి కనీస ఎగుమతి ధరను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగుమతులను తగ్గించడం ద్వారా దేశీయంగా సరఫరా పెంచి ధరలకు కళ్లెం వేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

జూలైలో ఎగుమ‌తి ధ‌ర 186 డాల‌ర్లుండ‌గా.. ఇప్పుడు 850 డాల‌ర్లు:

గత జులైలో టన్ను ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర 186 డాలర్లుండగా ఇప్పుడు 850 డాలర్లకు పెరిగింది. దీనివల్ల ఆసియా దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. అయినా దేశంలో చిల్లర ధరలు తగ్గడం లేదు. అతిపెద్ద ఉత్పత్తిదారైన భారత్‌లో ఎగుమతులపై పరిమితి విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో సరకు కొరత మ‌రింత‌ ఏర్పడింది. దీంతో ఈ ప్రభావం బంగ్లాదేశ్, మలేసియా దేశాలపై పడింది. బంగ్లాలో కిలో రూ.110 రూపాయల ఆల్ టైం రికార్డు సృష్టించింది.

Next Story